
పంచారామ సర్వీసులను ప్రారంభిస్తున్న డిపో మేనేజర్ శ్రీనివాసరావు
విజయనగరం అర్బన్: కార్తీక మాసంలో శైవపుణ్య క్షేత్రాల దర్శనాల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పంచారామ సర్వీసులు ఆది వారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు డిపో మేనేజర్ జె.శ్రీనివాసరావు జెండా ఊపి బస్సుల సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డిపో మేనేజ ర్ మాట్లాడుతూ మూడు బస్సులకు సరిపడా ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకోవడంతో తొలి రోజున మూడు సర్వీసులను నడిపామని అన్నా రు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు బయలుదేరిన ఈ సర్వీసులు ఐదు క్షేత్రాలను సందర్శించి సోమవారం అర్ధరాత్రికి బయలు దేరిన చోటకి తిరిగి వస్తాయన్నారు. సందర్శించే పుణ్యక్షేత్రాలలో అమరావతి (అమరేశ్వరుడు), పాలకొల్లు (క్షీరరామలింగేశ్వరుడు), భీమవరం (సోమేశ్వరుడు), ద్రాక్షరామం (భీమేశ్వరుడు), సామర్లకోట (కొమరలింగేశ్వరుడు) ఉన్నాయన్నారు. ఇదే విధంగా ఈ నెల 26, వచ్చే నెల 3, 10వ తేదీలలో ప్రత్యేక సర్వీసులు నిర్వహిస్తామని తెలిపారు. సర్వీసులో ఒక్కొక్కరికీ ఆల్ట్రా డీలక్స్ సర్వీసులకు కేవలం రూ.1,900, సూపర్ లగ్జరీ సర్వీసులకు రూ.1,950 మాత్ర మే చార్జీలు ఉంటాయన్నారు. టిక్కెట్ బుకింగ్ కోసం ‘ఏపీఎస్‌ఆర్‌టీసీఆన్‌లైన్.ఐఎన్’ లాగిన్ లో పొందవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అదే విధంగా దగ్గరలో ఉన్న డిపోకి వెళ్లి టిక్కెట్లను బుక్ చేసుకొనే సౌకర్యం కూడా ఉందన్నారు. పూర్తి వివరాల కోసం 99592 25620, 94943 31213, 73829 23683 నంబర్లను సంప్రదించవచ్చని సూచించారు. కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ బి.ఆదినారాయణ, ఎఫ్‌ఎం హేమంత్, డిపో సిబ్బంది పాల్గొన్నారు.