
పూర్తిగా ధ్వంసమైన ఇల్లు, సామగ్రి
లక్కవరపుకోట: గ్రామంలోని గవరవీధిలో గ్యాస్ లైకై ఒక ఇల్లు పూర్తిగా పేలిపోయి శ్లాబ్ మొత్తం కూలిపోయింది. ఆ ఇంటి పరిస్థితి బీభత్సంగా మారిపోయి ఇంట్లో నుంచి క్షతగాత్రుల ఆర్తనాదాలు వినిపించడంతో గ్రామస్తులు హతాశులయ్యారు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నయి. 10 రోజుల క్రితం పూసపాటిరేగ మండలం నుంచి వలస వచ్చిన తామరాపల్లి వెంకటలక్ష్మి(50), ఆమె కుమార్తె కెల్ల శ్రావణి (30) ఆమె పిల్లలు మోహన్ (10), లాస్య(8), శ్రావణి అన్న కుమార్తె ప్రణవి(7) గవర వీధిలోని ఓ ఇంట్లో అద్దెకు దిగారు. కాగా శనివారం రాత్రి గ్రామంలో గల బంధువుల ఇంట్లో భోజనం చేసి అద్దెకు తీసుకున్న ఇంటికి వచ్చి నిద్రపోయారు. అయితే ఆదివారం తెల్లవారుజూమున సుమారు 5 గంటల సమయంలో వెంకటలక్ష్మి నిద్రలేచి టీ పెట్టేందుకు వంట గదిలోకి వచ్చి లైట్ వేసేందుకు స్విచ్ ఆన్ చేసింది. క్షణాల్లో పెద్ద శబ్దంతో ఇల్లు మొత్తం పేలిపోయింది. ఏం జరిగిందో అర్థం కాలేదు. ఇల్లు పేలిపోతున్న సమయంలో వచ్చిన కొద్దిపాటి మంటల్లో ముగ్గురు చిన్నారులతో పాటు వెంకటలక్ష్మి, శ్రావణిల బట్టలు పూర్తిగా కాలిపోయి గాయాల పాలయ్యారు. ఈ ఇల్లు పేలిపోవడంతో పాటు చుట్టుపక్కల గల 8 ఇళ్ల గోడలు బీటలు వారాయి. బాత్‌రూమ్‌లు ధ్వంసం కాగా కిటికీల అద్దాలు పూర్తిగా పగిలిపోయాయి. ఇల్లు పేలిన శబ్దం, క్షతగాత్రుల ఆర్తనాదాలు విన్న ఇరుగుపొరుగువారు వెంటనే వచ్చి చూసి క్షతగాత్రులను ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి హూటాహుటిన 108 వాహనంలో ఎస్.కోట తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయనగరం కేంద్రాస్పత్రికి తీసుకెవెళ్లారు. వెంకటలక్ష్మి, శ్రావణిల పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రమాద సమాచారం మేరకు ఎస్.కోట అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్‌తో ప్రమాద స్థలానికి వచ్చి గ్యాస్ ధాటికి పేలిపోయిన ఇంటి పక్కనే గల గడ్డివాము కాలిపోతుండడంతో ఆర్పివేశారు. అనంతరం ఫైర్ ఆఫీసర్ ఎస్‌కె.మదీనా మాట్లాడుతూ గ్యాస్ లీక్ అయి ఆ గదిలో తలుపులు, కిటికీలు మూసివేసి ఉండడంతో గ్యాస్ నిండిపోయివదని, అంతలో స్విచ్ ఆన్ చేయగానే వచ్చిన స్పార్క్‌కు ఒక్కసారిగా ఇట్లు పేలిపోయినట్లు తెలిపారు. ప్రమాద వార్త తెలుసుకున్న తహసీల్దార్ కల్యాణ చక్రవర్తి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలను చేపట్టారు. అలాగే మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ఆమె భర్త రాంప్రసాద్ ఘటనా స్థలాన్ని సందర్శించి విచారం వ్యక్తం చేశారు.
ఫోన్‌లో పరామర్శించిన ఎమ్మెల్యే కడుబండి
విజయగరంలో చికిత్స పొందుతున్న బాధితులను ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు పరామర్శించి ఆమెరికాలో ఉన్న ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు క్షతగ్రాతుల పరిస్థితిని వివరించడంతో ఎమ్మెల్యే స్పందించి క్షతగాత్రులతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని, అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మరింతగా ఆదుకునేందుకు కృషి చేస్తానని బాధితులకు ధైర్యం చెప్పారు.
ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురికి తీవ్ర గాయాలు

క్షతగాత్రులను 108 వాహనంలో తరలిస్తున్న సిబ్బంది

గ్యాస్ లీక్‌తో బ్లాస్టయిన శ్లాబ్‌ఇల్లు