అంతా ఉత్కంఠ | - | Sakshi
Sakshi News home page

అంతా ఉత్కంఠ

Nov 3 2026 2:09 AM | Updated on Nov 3 2026 2:09 AM

113 కౌంటింగ్‌ హాళ్లలో ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం 1507 కౌంటింగ్‌ టేబుళ్లు ఏర్పాటు దాదాపు 5000 మంది సిబ్బంది నియామకం రెండు రౌండ్లలో కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తి చేసేలా ప్రణాళికలు తొలి ఫలితం 76వ వార్డు ..

సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ ఎన్నికల సమరంలో తుది ఘట్టం ఆసన్నమైంది. నగర మేయర్‌ పీఠాన్ని ఏ పార్టీ దక్కించుకోబోతుందో తేల్చేందుకు సర్వం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికలను తలపించిన ఈ సమరంలో ఓటర్లు వేసిన తీర్పు మంగళవారం వెల్లడికానుంది.

కౌంటింగ్‌ నిర్వహణ కోసం ఏయూ నార్త్‌ క్యాంపస్‌లో 8 బ్లాకులు, సౌత్‌ క్యాంపస్‌లో 2 బ్లాకుల్లో మొత్తం 113 కౌంటింగ్‌ హాళ్లను ఏర్పాటు చేశారు. లెక్కింపు వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేసేందుకు అధికారులు 1507 కౌంటింగ్‌ టేబుళ్లను అందుబాటులోకి తెచ్చారు. రౌండ్లవారీగా ఫలితాలు త్వరగా వెలువడేలా దాదాపు 5 వేల మంది సిబ్బందిని ఈ లెక్కింపు ప్రక్రియలో పాల్గోనున్నారు.

రెండు రౌండ్లలో కౌంటింగ్‌ పూర్తి చేసేలా..

గరిష్టంగా రెండు రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అధికారులందరూ ఉదయం 5 గంటలకే కౌంటింగ్‌ కేంద్రాలకు చేరుకోవాలని, ఉదయం 6 గంటలకు అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్‌ రూములను తెరవాలని జిల్లా ఎన్నికల అధికారి ఆదేశించారు. బ్యాలెట్‌ పత్రాలను కౌంటింగ్‌ హాళ్లకు తరలించి ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్లతో సహా ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. మొత్తం ప్రక్రియను కేవలం రెండు రౌండ్లలోనే పూర్తి చేసేలా అధికారులు పక్కా ప్రణాళికలు రూపొందించారు. దీంతో మధ్యాహ్నానికే జీవీఎంసీ ఫలితాలపై ఒక స్పష్టమైన అవగాహన వచ్చే అవకాశం ఉంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు, స్థానిక నాయకులు లెక్కింపు కేంద్రాల వద్ద ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఫలితాల ప్రకటన అనంతరం ఎలాంటి ఘర్షణలు, గొడవలు జరగకుండా కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. మరి విశాఖ మేయర్‌ పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారో చూడాలి.

తొలి ఫలితం 76వ వార్డుదే..

జీవీఎంసీ ఎన్నికల కౌంటింగ్‌లో రెండు రౌండ్లలోనే 120 వార్డుల ఫలితాలు వెలువడనున్నాయి. అన్ని వార్డులకు సంబంధించి 1,507 కౌంటింగ్‌ టేబుళ్ల వద్ద ఒకేసారి లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. వీటిలో తక్కువ ఓట్లు పోలైన 76వ వార్డుదే తొలి ఫలితం కానుంది. ఆ తర్వాత 105వ వార్డు, 29వ వార్డు, 54వ వార్డు, 74వ వార్డుల ఫలితాలు వెలువడనున్నాయి. 5వ వార్డు, 107వ వార్డు, 109వ వార్డుల ఫలితాలు చివరిగా ప్రకటించే అవకాశం ఉంది.

సెల్‌ఫోన్ల నిషేధం

జీవీఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్‌ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని స్పష్టం చేశారు. కేవలం కౌంటింగ్‌ హాల్‌ సూపర్వైజర్లు, ట్యాబులేషన్‌ ఇన్‌చార్జిలకు మాత్రమే నిబంధనల మేరకు సెల్‌ఫోన్ల వినియోగానికి అనుమతి ఉంటుందని తెలిపారు. మిగిలిన వారు ఫోన్లు భద్రపరుచుకునేందుకు వీలుగా అక్కడక్కడా డిపాజిట్‌ కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కౌంటింగ్‌ ప్రక్రియకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియాకు అందించాలని అధికారులను ఆదేశించారు.

ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు కౌంటింగ్‌ జరిగే ప్రాంతంలో ఎలాంటి హడావుడి చేయరాదని, గుంపులుగా చేరడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడకూడదని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

నేడే జీవీఎంసీ ఎన్నికల ఫలితాలు

పకడ్బందీగా జీవీఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌

ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి ఎం. అభిషిక్త్‌ కిశోర్‌ అధికారులను ఆదేశించారు. ఏయూలో నిర్వహించనున్న కౌంటింగ్‌ ప్రక్రియ ఏర్పాట్లపై సోమవారం సాయంత్రం సీపీ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌, సంబంధిత అధికారులతో ఇంజినీరింగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ బ్లాక్‌ వద్ద సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. స్ట్రాంగ్‌ రూములు తెరిచినప్పటి నుంచి కౌంటింగ్‌ పూర్తయి ఫలితాలు ప్రకటించే వరకు జోనల్‌ కమిషనర్లు, రిటర్నింగ్‌ అధికారులు, డిప్యూటీ కలెక్టర్లు, నోడల్‌ అధికారులు, కౌంటింగ్‌ సూపర్వైజర్లు నిరంతరం సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. ప్రతి బ్లాక్‌కు ప్రత్యేక ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ఏర్పాటు చేసి, వాటిపై సిబ్బంది, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఏజెంట్లకు ముందుగానే స్పష్టమైన సమాచారం అందించాలన్నారు. ప్రతి బ్లాక్‌ వద్ద వెయిటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, వాహనాలను కౌంటింగ్‌ కేంద్రానికి 500 మీటర్ల దూరంలోనే పార్కింగ్‌ చేసి నడుచుకుంటూ రావాలని సూచించారు. కౌంటింగ్‌ సిబ్బంది ఎన్నికల నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండటంతో పాటు, ఏజెంట్లకు కూడా అవసరమైన సూచనలు అందించాలన్నారు. ప్రతి రౌండ్‌లో లెక్కించిన ఓట్లను క్షుణ్ణంగా పరిశీలించి, పీవో డైరీలోని వివరాలు, ట్యాబులేషన్‌ రికార్డులతో సరిపోల్చుకోవాలని ఆదేశించారు. ఏవైనా సందేహాలు లేదా అనూహ్య పరిస్థితులు ఎదురైతే సంబంధిత జోనల్‌ కమిషనర్లు, రిటర్నింగ్‌ అధికారులు, నోడల్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలన్నారు. నిర్ణీత సమయపాలనతో లెక్కింపు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఆయా వార్డుల ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే సంబంధిత వార్డు సభ్యుల ఎన్నిక ఫలితాలను ప్రకటించాలని, మేయర్‌ పదవికి సంబంధించిన తుది ఫలితాన్ని మాత్రం అన్ని వార్డుల లెక్కింపు పూర్తయిన అనంతరం ప్రకటించాలని కలెక్టర్‌ ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement