203 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు 5న పోలింగ్ ఓటు హక్కు వినియోగించుకోనున్న 1,62,407 మంది ఓటర్లు పటిష్ట ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం
మహారాణిపేట: జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారానికి మంగళవారంతో తెరపడనుంది. ఈ నెల 5న జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు 48 గంటల ముందు ప్రచారం నిలిపివేయాల్సి ఉంటుంది. కలెక్టర్, ఎన్నికల అధికారి ఎం. అభిషిక్త్ కిశోర్ ఆధ్వర్యంలో రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ జి. విద్యాధరి పర్యవేక్షణలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి పి. నారాయణమూర్తి ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
నాలుగు మండలాల్లో ఎన్నికలు: జిల్లాలోని భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి మండలాల్లో నాలుగు జెడ్పీటీసీ, 53 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 203 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 1,62,407 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 79,630 మంది పురుషులు, 82,777 మంది మహిళలు ఉన్నారు.
పంపిణీ, లెక్కింపు కేంద్రాలు సిద్ధం
ఎన్నికల సామగ్రి పంపిణీ, స్ట్రాంగ్ రూములు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఖరారు చేశారు. భద్రతా ఏర్పాట్లతో పాటు సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేస్తున్నారు. 203 పోలింగ్ కేంద్రాల్లో 102 చోట్ల లైవ్ టెలికాస్టింగ్, 101 కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. భీమిలి, పద్మనాభం మండలాలకు సీడార్ (పాత ఏఎంజీ స్కూలు, భీమిలి)లో ఎన్నికల సామగ్రి పంపిణీ, స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆనందపురంలో ఎంపీడీవో కార్యాలయం, పెందుర్తిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా పరిషత్ సీఈవో పి. నారాయణమూర్తి తెలిపారు.
16 జోన్ల ఏర్పాటు : ఎన్నికల నిర్వహణ కోసం 16 జోన్లను ఏర్పాటు చేశారు. 203 పోలింగ్ కేంద్రాలను 106 ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల విధుల కోసం 1,484 మంది సిబ్బందిని నియమించగా, పోలింగ్ సామగ్రి తరలింపునకు 25 రూట్లను గుర్తించారు.
పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును పర్యవేక్షించేందుకు నాలుగు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ బృందాలు, నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్లు, నాలుగు స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు, రెండు వీడియో వీక్షణ బృందాలు, ఐదు ఎన్నికల వ్యయ పరిశీలన బృందాలు, ఐదు సింగిల్ విండో క్లియరెన్స్ బృందాలను ఏర్పాటు చేశారు. మండల, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. పోలింగ్ రోజు ఓటింగ్ సరళికి సంబంధించిన వివరాలను నిర్ణీత సమయాల్లో కంట్రోల్ రూమ్‌లకు అందించాలని ఆదేశించారు.
బ్యాలెట్ పత్రాలకు రంగుల కేటాయింపు
జెడ్పీటీసీ బ్యాలెట్ పత్రానికి తెలుపు రంగు, ఎంపీటీసీ బ్యాలెట్ పత్రానికి గులాబీ రంగు కేటాయించారు. ప్రతి ఓటరు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. విశాఖ జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని బీసీ జనరల్‌కు కేటాయించారు. ఆనందపురం జెడ్పీటీసీ జనరల్, భీమిలి జెడ్పీటీసీ జనరల్ (మహిళ), పద్మనాభం బీసీ (మహిళ), పెందుర్తి బీసీ జనరల్‌కు కేటాయించారు. ఎంపీపీ స్థానాల్లో ఆనందపురం బీసీ జనరల్, భీమిలి బీసీ జనరల్, పద్మనాభం జనరల్ మహిళ, పెందుర్తి జనరల్‌గా రిజర్వేషన్లు ఖరారు చేశారు.
మద్యం దుకాణాలు మూసివేత
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని మద్యం దుకాణాలను మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి మూసివేయాలని ఎకై ్సజ్ అధికారులు ఆదేశించారు. 4న రోజంతా, 5న పోలింగ్ పూర్తయ్యే వరకు దుకాణాలు మూసివేయనున్నారు. 6న సాధారణంగా మద్యం దుకాణాలు తెరిచే అవకాశం ఉండగా, 7న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు గ్రామీణ ప్రాంతాల్లోని మద్యం దుకాణాలు మూసివేయాలని అధికారులు తెలిపారు.


