పోలింగ్‌.. రిగ్గింగ్‌...! | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌.. రిగ్గింగ్‌...!

Nov 3 2026 2:09 AM | Updated on Nov 3 2026 2:09 AM

జీవీఎంసీ ఎన్నికల్లో పోలింగ్‌ శాతంపై వెల్లువెత్తుతున్న అనుమానాలు

రాత్రి 10 గంటలకు 51.47 శాతం అని ప్రకటించిన అధికారులు

ఉదయం ఫైనల్‌ పోలింగ్‌ 56.32 శాతం అని ధ్రువీకరణ

కూటమి నేతలు రిగ్గింగ్‌ చేసినట్టు ఆరోపణలు

వైఎస్సార్‌సీపీ నేతల అనుమానాలే నిజమయ్యాయి

పలుచోట్ల రిగ్గింగ్‌ అడ్డుకునేందుకు యత్నించిన వైస్సార్‌సీపీ శ్రేణులు

పోలీసుల సహకారంతో రెచ్చిపోయిన కూటమి నేతలు

బ్యాలెట్‌ పేపర్లు బయటకు వచ్చినా పట్టించుకోని ఎన్నికల అధికారులు

గాజువాకలో 20 వేలు, పశ్చిమలో 17 వేలు పెరిగిన ఓటర్లు

ఉత్తరలో 15 వేలు, తూర్పులో అమాంతం 10 వేల ఓట్లు పెరుగుదలపై అనుమానాలు

సాక్షి,విశాఖపట్నం : జీవీఎంసీ ఎన్నికల పోలింగ్‌ సరళిపై అధికార యంత్రాంగం రెండుమార్లు విడుదల చేసిన ఈ అంకెల గారడీ.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా సాగిన చీకటి కుట్రలను బట్టబయలు చేస్తోంది. ఓటమి భయంతో వణికిపోయిన కూటమి నేతలు.. వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని రాత్రికి రాత్రే అడ్డగోలు రిగ్గింగ్‌కు తెరతీశారన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆదివారం రాత్రి 10 గంటలకు తాత్కాలిక అంచనాగా 51.47 శాతంగా నమోదైందంటూ సాక్షాత్తూ.. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ ప్రకటించారు. కానీ.. సోమవారం ఉదయానికి అమాంతం 56.32 శాతానికి చేరడం.. అధికార పార్టీ నేతలు, అధికారులు కలిసి ఆడిన కుట్రల కుతంత్రమేంటో ప్రపంచానికి అర్థమయ్యేలా చేసింది. పక్కా ప్రణాళికతో వేలాది ఓట్లు అదనంగా పోల్‌ అవుతున్నా, బ్యాలెట్‌ పేపర్లు పబ్లిక్‌గా బయటకు వస్తున్నా ఎన్నికల అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం, పోలీసులే దగ్గరుండి కూటమి నేతలకు సహకరించారని వైఎస్సార్‌సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఎన్నికల ముందే వైఎస్సార్‌సీపీ నేతలు వ్యక్తం చేసిన అనుమానాలను నిజం చేస్తూ, అధికార బలంతో కూటమి నేతలు సాగించిన ఈ కుతంత్రాలు విశాఖ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి.

ఆదివారం రాత్రి 10 గంటల సమయానికి అధికారులు విడుదల చేసిన వార్డుల వారీ నివేదిక ప్రకారం జీవీఎంసీ పరిధిలో మొత్తం 9,45,918 ఓట్లు పోలవగా, 51.47 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ప్రకటించారు. కానీ సోమవారం ఉదయం విడుదల చేసిన ఫైనల్‌ జోన్ల వారీ నివేదికలో ఈ శాతం అమాంతం 56.32 శాతానికి అంటే.. 10,35,154 ఓట్లు పోలయ్యాయని వెల్లడించారు. తొలుత ప్రకటించింది తాత్కాలిక నివేదిక అయినా.. తుది జాబితాలో మరో వెయ్యో.. రెండు వేల ఓట్లో జమ కావాలి. అంతేగానీ రాత్రికి రాత్రే పోలైన ఓట్లు భారీగా పెరిగిపోవడం అనుమానాలకు తావిస్తోంది.

రాత్రికి రాత్రే రిగ్గింగ్‌ జరిగిందా.?

అధికారిక గణాంకాలను పరిశీలిస్తే రాత్రికి రాత్రే కొన్ని జోన్లలో అసాధారణ స్థాయిలో ఓట్లు పెరిగాయి. ప్రధానంగా జీవీఎంసీ గాజువాక జోన్‌లో అత్యధికంగా 20,296 ఓట్లు పెరిగాయి. అదేవిధంగా పశ్చిమ జోన్‌లో 17,242 ఓట్లు, నార్త్‌ జోన్‌లో 15,955 ఓట్లు, ఈస్ట్‌ జోన్‌లో 10,840 ఓట్లు అదనంగా నమోదయ్యాయి. అదేవిధంగా.. పెందుర్తిలో 9,246 ఓట్లు, మధురవాడలో 6,371 ఓట్లు, అగనంపూడిలో 6,017 ఓట్లు పెరగడం ఈ రిగ్గింగ్‌ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. ఈ అనూహ్య ఓట్ల పెరుగుదల వెనుక కూటమి నేతల రిగ్గింగ్‌ ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఎన్నికల సరళిపై మొదటి నుంచి తాము వ్యక్తం చేసిన అనుమానాలే నిజమయ్యాయని వైఎస్సార్‌సీపీ నేతలతో పాటు వామపక్షాలూ వ్యాఖ్యానిస్తున్నాయి. పలుచోట్ల రిగ్గింగ్‌ను అడ్డుకునేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు తీవ్రంగా యత్నించినప్పటికీ, పోలీసుల, ఎన్నికల అధికారుల సహకారంతో కూటమి నేతలు రెచ్చిపోయారని వారు ఆరోపిస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాల నుంచి బ్యాలెట్‌ పేపర్లు బయటకు వచ్చినా ఎన్నికల అధికారులు కనీసం పట్టించుకోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

జీవీఎంసీ పరిధిలోని 120 వార్డుల్లో మొత్తం 18,37,901 మంది ఓటర్లకు గాను.. 9,45,918 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు మొత్తం 51.47 శాతం పోలింగ్‌ నమోదైంది.’

– ఆదివారం రాత్రి 9.45 గంటలకు

జిల్లా కలెక్టర్‌, ఎన్నికలఅధికారి అభిషిక్త్‌ కిశోర్‌

జీవీఎంసీ పరిధిలోని 10 జోన్లలోని 120 వార్డుల్లో మొత్తం 18,37,901 మంది ఓటర్లకు గాను.. 10,35,154 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు మొత్తం 56.32 శాతం పోలింగ్‌ నమోదైంది.

– సోమవారం ఉదయం 9.30 గంటలకు

జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌

విడుదల చేసిన వివరాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement