● కూటమిలో కుమ్ములాటలు..
గ్రేటర్ ఎన్నికల రాజకీయాలను కూటమిలోని కొందరు నేతలు సీట్ల కేటాయింపును తమ వ్యక్తిగత ఏటీఎంలుగా మార్చుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీట్లు దక్కని అసంతృప్తి ఒకవైపు.. దక్కిన సీట్లకు నాయకులు కోట్ల రూపాయలు గుంజుతున్నారన్న ఆరోపణలు మరోవైపు.. వెరసి కూటమిలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. పొత్తుల ముసుగులో జరుగుతున్న ఈ రాజకీయ దందా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పొత్తుల పేరిట జరుగుతున్న సీట్ల పంపకాలు.. ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే ప్రక్రియలా కాకుండా, కాంట్రాక్టుల వేలంపాటను తలపించాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విలువలను పక్కన పెట్టి.. కేవలం డబ్బులు ఇచ్చిన వారికే టికెట్లు అన్నట్లుగా నేతలు వ్యవహరిస్తుండటంతో కూటమిలో లుకలుకలు రచ్చకెక్కాయి.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం :
కూటమి పొత్తుల లెక్కల్లో ఏళ్ల తరబడి పార్టీ జెండా మోసిన నాయకులకు అన్యాయం జరిగిందన్న విషయం.. ఇటీవల జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే అదనుగా భావించిన కొందరు కీలక నేతలు సీట్లను అంగట్లో సరుకుల్లా మార్చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఏకంగా ఒక్కో కార్పొరేటర్ సీటుకు రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా, సూట్‌కేసులు తెచ్చిన వారికే పెద్దపీట వేసి.. ప్రజాస్వామ్యానికే మాయని మచ్చగా నిలిచారని కొందరు నాయకులు ఆరోపిస్తున్నారు.
బీ–ఫారం కోసం రూ.25 లక్షలు వసూళ్లు?
ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు పార్టీ అధిష్టానం అండగా నిలవాల్సింది పోయి.. జనసేన నాయకులే రివర్స్‌లో వసూళ్లకు దిగినట్లు తెలుస్తోందని ఆరోపణలు ఉన్నాయి. అభ్యర్థులకు పార్టీ నుంచి ఎలాంటి నిధులు రాకపోగా, నాయకుల వ్యక్తిగత ఖాతాలకు ‘పార్టీ ఫండ్’ పేరుతో డబ్బులు బదిలీ చేయాలని కఠిన ఆంక్షలు విధించారని సమాచారం. ఒక్కో కార్పొరేటర్ బీ–ఫారం కోసం సుమారు రూ.25 లక్షలు డిమాండ్ చేసి, ఆ డబ్బును జనసేన నేతలు తమ జేబుల్లో వేసుకున్నారన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. సీట్ల పంపకాల విషయంలో అడ్డగోలుగా వ్యవహరించారంటూ పెందుర్తికి చెందిన ఒక జెడ్పీటీసీ నేత స్వయంగా ఆరోపణలు చేయడం గమనార్హం. పెందుర్తికి చెందిన ఓ టీడీపీ నేత.. తాను రూ.కోటిన్నర అప్పు తీసుకున్న వ్యక్తికి టికెట్ ఇప్పిస్తానని, ఆ రుణాన్ని మాఫీ చేయాలని షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ షరతులకు తలొగ్గి, డబ్బులు ముట్టజెబితే తప్ప బీ–ఫారాలు ఇవ్వబోమని తమ పార్టీ జిల్లా పెద్దలు బ్లాక్‌మెయిల్‌కు దిగారంటూ కొందరు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పార్టీ పెద్దలకు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం.
శివశంకర్ చేతికి బీ–ఫారాల పగ్గాలు!
కార్పొరేటర్ అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో.. జనసేన పార్టీలో బీ–ఫారాల పంపిణీ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. పార్టీకి చెందిన కీలక నేత సంతకంతో వచ్చిన బీ–ఫారాలను పంపిణీ చేసే బాధ్యతను సాధారణంగా స్థానిక ముఖ్య నేతలకే అప్పగిస్తారు. కానీ జనసేన నేతలపై వచ్చిన ఫిర్యాదులతో బీ–ఫారాలు అందజేసే బాధ్యతను పార్టీ సీనియర్ నాయకుడు శివశంకర్‌కు అప్పగించడంతో స్థానిక నేతలు అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది.
ఓ చేత్తో బీ–ఫారాలు ఇచ్చి.. మరో చేత్తో వసూళ్ల పర్వం సాగించాలని భావించిన స్థానిక జనసేన నేతలకు ఒక్కసారిగా పరిస్థితి రివర్స్ కావడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
టీడీపీలోనూ దందాల దౌర్జన్యం?
అధికార టీడీపీ నేతలు కూడా జనసేన బాటలోనే పయనించారన్న విమర్శలు వస్తున్నాయి. విశాఖ పశ్చిమ నియోజకవర్గం టీడీపీలో ఈ వసూళ్ల పర్వం కొత్త పుంతలు తొక్కిందన్న ఆరోపణలు ఉన్నాయి. సీట్ల విషయంలో టీడీపీ కీలక నేతే స్వయంగా భారీ వసూళ్లకు పాల్పడ్డారని సొంత పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు అధికార పార్టీకి చెందిన కీలక సామాజికవర్గ నేతలు ఎన్నారైల నుంచి కూడా అందిన మేరకు డబ్బులు వసూలు చేయడం మొదలు పెట్టారని సమాచారం. పార్టీ విజయానికి డబ్బులు అవసరమంటూ ఆ పేరుతోనూ దందా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏకంగా ఎన్నారైలనూ వదలకుండా సుమారు రూ.కోట్లు వసూలు చేశారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
కూటమికి బీటలు?
కూటమి పార్టీల నేతల మధ్య సమన్వయం పూర్తిగా లోపించిందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. జనసేన నేతల నుంచి వస్తున్న అడ్డగోలు ఆర్థిక డిమాండ్లు, సీట్ల పంచాయతీలతో క్షేత్రస్థాయిలో పరిస్థితి చేయి దాటిపోయిందని అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. ఈ పరిణామాలను భరించలేక ఒకటి రెండు చోట్ల టీడీపీ నేతలు ఏకంగా తమ పార్టీకే రాజీనామా చేస్తామంటూ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారంటే.. క్షేత్రస్థాయిలో పార్టీ నేతల వ్యవహారం ఎంతలా రచ్చకెక్కిందో అర్థం చేసుకోవచ్చని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు కూటమి నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం ఇటీవల జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో బట్టబయలైందన్న చర్చ సాగుతోంది. ఇరు వర్గాల మధ్య సీట్ల పంపకాల వ్యవహారంలో జరిగిన తీవ్ర వాగ్వాదంతో సమావేశం రసాభాసగా మారింది. ఆగ్రహానికి గురైన జనసేన నేతలు భేటీని బహిష్కరించి అర్ధంతరంగా వెళ్లిపోయారు. అక్కడే ఉన్న ఎంపీ భరత్ వారిని పదేపదే వెనక్కి పిలిచి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా..కనీసం ఖాతరు చేయకుండా వారు వాకౌట్ చేయడం కూటమిలోని అంతర్గత విభేదాలను స్పష్టం చేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


