స్వేచ్ఛాయుత ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

స్వేచ్ఛాయుత ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు

Oct 18 2026 1:42 AM | Updated on Oct 18 2026 1:42 AM

● జీవీఎంసీలో 120 వార్డులకు ఈ నెల 28న పోలింగ్‌, 30న ఓట్ల లెక్కింపు ● కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌

మహారాణిపేట: జీవీఎంసీ ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ పేర్కొన్నారు. పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌, జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, డీపీవో శ్రీనివాసరావులతో కలిసి శనివారం కలెక్టరేట్‌ వీసీ హాల్‌లో మీడియాతో మాట్లాడారు. జీవీఎంసీ పరిధిలోని 120 వార్డులకు ఈ నెల 28న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందన్నారు. ఈ నెల 30వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. ఇప్పటి వరకు మేయర్‌ స్థానానికి 7 నామినేషన్లు, కార్పొరేటర్‌ స్థానాలకు 331 నామినేషన్లు అందినట్లు వెల్లడించారు.

పకడ్బందీగా కోడ్‌ అమలు

ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించినప్పటి నుంచి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు సుమారు 1,000 పోస్టర్లు, 1,600 బ్యానర్లు, 350 జెండాలను తొలగించడంతో పాటు 300కు పైగా విగ్రహాలు, 300కు పైగా శంకుస్థాపన, ప్రారంభోత్సవ శిలాఫలకాలను కప్పివేసినట్లు చెప్పారు.

మేయర్‌కు పింక్‌.. కార్పొరేటర్‌కు వైట్‌ కలర్‌ బ్యాలెట్‌

మేయర్‌, కార్పొరేటర్‌ ఎన్నికల్లో రెండు బ్యాలెట్లపై రెండు ఓట్లు వేయాల్సి ఉంటుందని తెలిపారు. పింక్‌ కలర్‌ బ్యాలెట్‌ మేయర్‌ అభ్యర్థిని, వైట్‌ కలర్‌ బ్యాలెట్‌ కార్పొరేటర్‌ అభ్యర్థిని సూచిస్తుందని స్పష్టం చేశారు. ఓటు వేశాక రెండు బ్యాలెట్‌ పేపర్లను ఒక బాక్సులోనే వేయాల్సి ఉంటుందని చెప్పారు.

నియమావళి ఉల్లంఘన ఉంటే ఫిర్యాదులకు..

జీవీఎంసీ పరిధిలో ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదుల కోసం 1800 425 00009 టోల్‌ఫ్రీ నంబరును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జీవీఎంసీకి సంబంధించి ఫిర్యాదుల స్వీకరణకు 1800 425 00009, స్థానిక సంస్థలకు సంబంధించి 95737 08855 నంబర్లకు ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు.

6,607 మంది పోలీసులతో బందోబస్తు

నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు 6,607 మంది పోలీసు సిబ్బందిని కేటాయిస్తున్నామన్నారు. పోలింగ్‌ కేంద్రాల భద్రతతో పాటు రూట్‌ మొబైల్స్‌, స్ట్రైకింగ్‌ ఫోర్సెస్‌, చెక్‌పోస్టులు, స్టాటిక్‌ పికెట్లు, షాడో టీమ్స్‌, కంట్రోల్‌ రూమ్‌, స్ట్రాంగ్‌ రూములు, డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రత కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అత్యవసర సమాచారాన్ని తన వ్యక్తిగత నంబర్‌ 79950 95799కు కూడా తెలియజేయవచ్చని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement