మద్దిలపాలెం: కళాభారతి ఆడిటోరియంలో శనివారం ప్రముఖ కూచిపూడి నృత్యాచార్యుడు పద్మభూషణ్ వెంపటి చిన్న సత్యం 97వ జయంతి వేడుకలు నృత్య సమ్మోహనంగా జరిగాయి. విశాఖ ఆర్ట్ అండ్ డాన్స్ అసోసియేషన్, కూచిపూడి కళాక్షేత్రం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి సెట్విస్ సీఈవో రమ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్ఎంఎస్ డెంటల్ హాస్పిటల్ ఎండీ డా. శ్రీధర్ మిత్ర, వీఎండీఏ అధ్యక్షుడు ఎం.ఎస్.ఎన్. రాజు, కూచిపూడి కళాక్షేత్ర కార్యదర్శి ఎం.ఎస్. శ్రీనివాస్, డ్యాన్స్ ఇండియా మ్యాగజైన్ చీఫ్ ఎడిటర్ బత్తిన విక్రమ్ కుమార్, కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ కార్యదర్శి చైన్నె శ్రీమయి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా పద్మభూషణ్ వెంపటి చిన్న సత్యం జీవిత సౌఫల్య పురస్కారం–2026ను ఢిల్లీకి చెందిన సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత సీతా నాగజ్యోతికి ప్రదానం చేశారు. వెంపటి చిన్న సత్యం మనవరాలు కుమారి లక్ష్మీ కామేశ్వరి, ప్రముఖ కూచిపూడి నర్తకుడు ఎస్. సుబ్బరాజు, సన్నిధా రాజా సాగి, సింధుజతో పాటు కూచిపూడి కళాక్షేత్ర విద్యార్థులు సంప్రదాయ నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. వెంపటి చిన్న సత్యం పేరిట ఏర్పాటు చేసిన వీ.సీ.ఎస్ మెరిట్ స్కాలర్షిప్లను విజేతలకు అందజేశారు. కూచిపూడి కళాక్షేత్ర ప్రిన్సిపల్ గురుకళారత్న హరి రామమూర్తి, విశాఖ ఆర్ట్ అండ్ డాన్స్ అసోసియేషన్ వ్యవస్థాపక కార్యదర్శి కన్నం వెంకటరమణరావు, డీవీ గోపీనాథ్, ప్రసన్న పాల్గొన్నారు.


