వీడిన విశ్రాంత జీఎస్‌టీ అధికారి కిడ్నాప్‌ కేసు | - | Sakshi
Sakshi News home page

వీడిన విశ్రాంత జీఎస్‌టీ అధికారి కిడ్నాప్‌ కేసు

Oct 18 2026 1:42 AM | Updated on Oct 18 2026 1:42 AM

సాంకేతిక ఆధారాలతో బాధితుడిని విడిపించిన పోలీసులు

10 మంది నిందితుల అరెస్టు.. మరొకరి కోసం గాలింపు

ఆర్థిక లావాదేవీలే కిడ్నాప్‌కు కారణమా?

పీఎం పాలెం: విశాఖలో కలకలం రేపిన విశ్రాంత జీఎస్టీ అధికారి కిడ్నాప్‌ ఉదంతాన్ని పోలీసులు సాంకేతిక ఆధారాలతో ఛేదించారు. కిడ్నాప్‌కు గురైన అధికారిని సురక్షితంగా విడిపించి, ఈ ఘటనతో సంబంధమున్న 10 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా కిడ్నాప్‌ : విశాఖ నార్త్‌ జోన్‌ ఏసీపీ అప్పలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. జీఎస్‌టీ విభాగంలో అదనపు కమిషనర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన పి.ఆనందకుమార్‌ ఈ నెల 16న సాయంత్రం 6.30 గంటల సమయంలో రుషికొండలోని సాయిప్రియా రిసార్ట్స్‌ నుంచి విమానాశ్రయానికి కారులో బయలుదేరారు. ఐటీ సెజ్‌ ప్రాంతంలో కొందరు దుండగులు ఆయన కారు ను అడ్డగించి, బలవంతంగా తమ కారులో ఎక్కించుకుని అపహరించారు. ఈ ఘటనపై ఆయన కారు డ్రైవర్‌ సింగంపల్లి సురేష్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చికి ఫిర్యాదు చేశారు. వెంటనే పీఎం పాలెం సీఐ బాలకృష్ణ, ఆరిలోవ సీఐ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సీసీ టీవీ ఫుటేజీలు, సెల్‌ఫోన్‌ లొకేషన్ల ఆధారంగా కిడ్నాపర్లు విశాలాక్షినగర్‌ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడి ఏఏఆర్‌ హోమ్స్‌ గెస్ట్‌హౌస్‌లో తనిఖీలు నిర్వహించి ఆనందకుమార్‌ను బందీగా ఉంచినట్లు గుర్తించారు. వెంటనే దాడి చేసి ఆయనను సురక్షితంగా విడిపించి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఆర్థిక లావాదేవీలే కారణమా?

ఈ కేసులో ప్రధాన నిందితులుగా పేర్కొన్న లింగరాజు పాండురంగ హేమంత్‌కుమార్‌ శ్రీనివాసులు (44), దీపక్‌ విజయన్‌ (43)లకు ఆనందకుమార్‌తో కొంతకాలంగా ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే ఆయనను కిడ్నాప్‌ చేసి విశాలాక్షినగర్‌లోని గెస్ట్‌హౌస్‌లో నిర్బంధించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆనందకుమార్‌ భార్యకు ఫోన్‌ చేసి డబ్బులు ఇవ్వాలని, లేకుంటే ఆయనను చంపేస్తామని బెదిరించినట్లు వెల్లడించారు.

10 మంది అరెస్ట్‌ : ఈ కేసులో ప్రధాన నిందితులు ఇద్దరితో పాటు వారికి సహకరించిన కొల్లు శ్రీధర్‌ (43), ముత్యాల రాజు (34), కొండేటి జగదీష్‌ (31), రామేశ్వరపు సాయిమాధవ్‌ (31), దేవరపల్లి ప్రదీప్‌ (36), యజ్జల విజయబాబు (36), చింతాడ రంజిత్‌కుమార్‌ (31), కానూరి కిరణ్‌కుమార్‌ (35) లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులను శనివా రం రిమాండ్‌కు తరలించారు. ఇదే కేసులో మరో నిందితుడు జగదీష్‌ పరారీలో ఉన్నాడని ఏసీపీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement