విశాఖ విద్య: ఏయూలో డ్రైవర్ల ప్రమోషన్ల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ప్రమోషన్ల కోసం ఓ రేటు నిర్ణయించి బేరాలు సాగుతున్నాయంటూ నాన్ టీచింగ్ సిబ్బందిలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సీనియారిటీ ప్రకారం గ్రేడ్–1 డ్రైవర్లకు పదోన్నతులు ఇవ్వాల్సి ఉండగా, కొందరిని మాత్రమే ఎంపిక చేయడంపై వర్సిటీలో చర్చ జరుగుతోంది. ప్రమోషన్ లిస్టు ఎంపిక కోసం ఓ ఆచార్యుడిని నియమించడంపై సిబ్బంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
మూడు కేటగిరీల్లో డ్రైవర్లు
ఆంధ్ర యూనివర్సిటీలో డ్రైవర్ పోస్టులను గ్రేడ్–1 డ్రైవర్, గ్రేడ్–2 డ్రైవర్, క్లీనర్ కేటగిరీలుగా విభజిస్తారు. నిబంధనల ప్రకారం గ్రేడ్–1 డ్రైవర్ ప్రమోషన్లను గ్రేడ్–2 డ్రైవర్ల సీనియారిటీ ఆధారంగా, గ్రేడ్–2 ప్రమోషన్లను క్లీనర్ల సీనియారిటీ ప్రకారం ఎంపిక చేస్తారు. గత కొన్నేళ్లుగా ఈ విధానమే అమలవుతోందని సిబ్బంది చెబుతున్నారు. ఇటీవల గ్రేడ్–2 డ్రైవర్ ప్రమోషన్లు సీనియారిటీ ప్రకారం జరిగినప్పటికీ, నాలుగు గ్రేడ్–1 డ్రైవర్ పోస్టుల భర్తీ విషయంలో మాత్రం కొత్తగా ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయడం అనుమానాలకు తావిస్తోందని సీనియర్ డ్రైవర్లు పేర్కొంటున్నారు.
కమిటీ నిర్ణయంపై అభ్యంతరాలు
నాలుగు పోస్టులకు అర్హులైన నలుగురు డ్రైవర్లకు 25 నుంచి 30 ఏళ్ల అనుభవం ఉందని, వీరంతా రిజిస్ట్రార్, ప్రిన్సిపాళ్ల కారు డ్రైవర్లుగా సేవలందిస్తున్నారని చెబుతున్నారు. అయితే ఈ నలుగురిలో ఒక్కరినే ఎంపిక చేయాలని కమిటీ సభ్యుడైన ఓ ఆచార్యుడు నిర్ణయించడం వివాదానికి కారణమైందని అంటున్నారు. సీనియారిటీ జాబితాలో మూడో స్థానంలో ఉన్న వ్యక్తికి పదోన్నతి ఇవ్వాలని సిఫార్సు చేయడం వెనుక అవినీతి ఉందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. పోస్టుకు ఇంత అని రేటు నిర్ణయించి, ఆమ్యమ్యాలు ఇచ్చిన వారికే ప్రమోషన్లు వస్తాయన్న సంకేతాలు పంపినట్లు వర్సిటీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కమిటీలోని మిగిలిన సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినా ఒక సభ్యుడి అభిప్రాయమే అమలవుతోందని తెలుస్తోంది.
ట్రాన్స్‌పోర్టు విభాగంపై ఆరోపణలు
ఏయూ ట్రాన్స్‌పోర్టు విభాగంపైనా పలు ఆరోపణలు వస్తున్నాయి. ప్రైవేటు అద్దె ట్రావెల్స్‌కు అనుకూలంగా ఏయూ వాహనాలను వినియోగంలోకి రానివ్వడం లేదని, కండిషన్‌లో లేవనే కారణాలు చూపుతున్నారని కిందిస్థాయి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం యూనివర్సిటీ మూడు ప్రైవేట్ బస్సులకు ఒక్కో బస్సుకు నెలకు రూ.1.35 లక్షల చొప్పున అద్దె చెల్లిస్తోందని, ఆరు అద్దె కార్లకు నెలకు రూ.40 వేల చొప్పున చెల్లిస్తున్నట్లు చెబుతున్నారు. పర్మినెంట్ డ్రైవర్లు పెరిగితే అద్దె బస్సులకు ట్రిప్పుల ఆధారంగా చెల్లించే మొత్తం తగ్గుతుందని, అందువల్లే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


