నోటిఫికేషన్ కొన్నింటికే..
సిఫార్సులతో మరికొన్ని?
భీమిలి పోస్టు భర్తీపై
వెల్లువెత్తుతున్న ప్రశ్నలు
రోస్టర్, రిజర్వేషన్లపై న్యాయవాది పిల్
డాబాగార్డెన్స్: జీవీఎంసీలో ఎమ్మెస్సీ పోస్టుల భర్తీ వ్యవహారం వివాదాస్పదమవుతోంది. ఎనిమిది జోన్ల నుంచి పది జోన్లుగా మార్చి ఆరు నెలలు గడుస్తున్నా.. ఖాళీల భర్తీ పూర్తికావడం లేదు. నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ ద్వారా నియామకాలు చేపట్టాల్సి ఉండగా.. కొన్నింటికి నోటిఫికేషన్ ఇవ్వడం, మరికొన్నింటిని సిఫార్సుల మేరకు భర్తీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నేతల కనుసన్నల్లోనే..?
జీవీఎంసీ ఆస్తుల పరిరక్షణతో పాటు కోర్టు కేసుల పరిష్కారానికి ఎమ్మెస్సీలు గౌరవ వేతనంతో పనిచేస్తారు. నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులు రాజకీయ నేతల కనుసన్నల్లో భర్తీ అవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం పది జోన్లకు పది మంది ఎమ్మెస్సీలు ఉండాల్సి ఉండగా.. రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నెల 21న ఒక పోస్టు భర్తీకి జీవీఎంసీ అధికారులు స్థానిక బార్ అసోసియేషన్‌కు లేఖ రాశారు. పదేళ్ల అనుభవం ఉన్న న్యాయవాదులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. గతంలో ఎనిమిది జోన్లకు ఎమ్మెస్సీలను నియమించగా.. అందులో 15వ వార్డు మాజీ కార్పొరేటర్ భర్తకు ఓ పోస్టు ఇచ్చారని, ఒకే కుటుంబంలో ఇద్దరికి జీవీఎంసీలో పోస్టులు ఉండకూడదనే విమర్శలతో ఆ నియామకాన్ని రద్దు చేశారు. దీంతో మూడు పోస్టులు ఖాళీ అయ్యాయి.
రోస్టర్‌పై కోర్టును ఆశ్రయించిన న్యాయవాది
ఎమ్మెస్సీ పోస్టుల భర్తీలో రోస్టర్ విధానం, రిజర్వేషన్లు సక్రమంగా అమలు కావడం లేదని నగరానికి చెందిన ఓ సీనియర్ న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. రాజకీయ నేతల సిఫార్సులకే అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపిస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ పిల్‌పై విచారణ కొనసాగుతోంది. ఎమ్మెస్సీ పోస్టుల భర్తీలో నిబంధనలు, రోస్టర్, రిజర్వేషన్లు పాటిస్తూ పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని న్యాయవాదులు కోరుతున్నారు.
మిగిలిన పోస్టులపై సందిగ్ధం
ఎలాంటి నోటిఫికేషన్ లేకుండానే ఇటీవల భీమిలి జోన్‌కు ఓ న్యాయవాదిని ఎమ్మెస్సీగా నియమించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రద్దయిన పోస్టుతో పాటు మరో రెండు పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉండగా.. భీమిలి పోస్టును భర్తీ చేసి, మరో పోస్టుకు మాత్రమే ఈ నెల 21న నోటిఫికేషన్ ఇవ్వడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మిగిలిన ఒక పోస్టు భర్తీ ఎప్పుడు, ఎలా జరుగుతుందనే దానిపై స్పష్టత లేదని విమర్శలు వస్తున్నాయి.


