జీవీఎంసీ పరిధిలో 56 పునరావాస కేంద్రాలు | - | Sakshi
Sakshi News home page

జీవీఎంసీ పరిధిలో 56 పునరావాస కేంద్రాలు

Sep 26 2026 12:44 AM | Updated on Sep 26 2026 12:44 AM

● 257 మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు ● కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ వెల్లడి

మహారాణిపేట: భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించిందని కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ తెలిపారు. ప్రమాద ప్రాంతాల్లో ముందస్తు చర్యల్లో భాగంగా 97 కుటుంబాలకు చెందిన 257 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. జీవీఎంసీ పరిధిలో 56 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి బాధితులకు ఆహారం అందించామన్నారు. ఈనెల 21 నుంచి 25వ తేదీ ఉదయం 10 గంటల వరకు జిల్లాలో సగటున 332.7 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. గంభీరం గెడ్డ రిజర్వాయర్‌లోకి 100 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. అదే స్థాయిలో మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. మేహాద్రిగెడ్డ, రైవాడ, తాటిపూడి రిజర్వాయర్లలో నీటిమట్టాలు సురక్షిత స్థాయిలో ఉన్నాయన్నారు.

12 ఇళ్లు దెబ్బతిన్నాయి : భారీ వర్షాలకు జిల్లాలో 12 ఇళ్లు దెబ్బతిన్నాయని, విద్యుత్‌ శాఖకు సంబంధించి ఒక సబ్‌స్టేషన్‌, 36 ఫీడర్లు, 181 విద్యుత్‌ స్తంభాలు దెబ్బతినగా.. 28,934 కనెక్షన్లపై ప్రభావం పడిందని తెలిపారు. ఆర్‌అండ్‌బీ పరిధిలో 11.5 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని, తాత్కాలిక మరమ్మతులకు రూ.30 లక్షలు, శాశ్వత పునరుద్ధరణకు రూ.5.6 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశామన్నారు. 122 చెట్లు నేలకూలగా 116 తొలగించి రాకపోకలను పునరుద్ధరించినట్లు చెప్పా రు. నాలుగు గ్రామాల్లో 34 మంది రైతులకు చెందిన 6.48 హెక్టార్ల అరటి పంట దెబ్బతిన్నట్లు తెలిపారు. 13 పాఠశాలల భవనాలు లేదా ప్రహరీ గోడలు పాక్షికంగా దెబ్బతిన్నాయని వివరించారు.

234 ఫిర్యాదులు పరిష్కారం: కలెక్టరేట్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు వచ్చిన 55 ఫిర్యాదులనూ పరిష్కరించామని, జీవీఎంసీ సిటీ ఆపరేషన్స్‌ సెంటర్‌కు వచ్చిన 179 ఫిర్యాదుల్లో 163 పరిష్కరించినట్లు కలెక్టర్‌ తెలిపారు. మిగిలిన 16 ఫిర్యాదులపై పనులు కొనసాగుతున్నాయన్నారు.

యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు

అల్లిపురం: తీవ్ర వాయుగుండం ‘అర్నాబ్‌’ ప్రభావంతో నగరంలో భారీ వర్షాలు, ఈదురు గాలుల నేపథ్యంలో జీవీఎంసీ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన సహాయక, పునరుద్ధరణ చర్యలు చేపట్టిందని కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ తెలిపారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు 187 వర్ష సంబంధిత ఘటనలు నమో దుకాగా, 180 పరిష్కరించామన్నారు. 124 చోట్ల చెట్లు కూలగా, 120 ప్రాంతాల్లో తొలగించినట్లు చెప్పారు. నీరు నిలిచిన 18, డ్రైన్లు పొంగిన 17 ప్రాంతాల్లో సమస్యలు పరిష్కరించామని, మధురవాడ కొమ్మాది హౌ సింగ్‌ బోర్డు కాలనీలో 15 కుటుంబాలకు చెందిన 70 మందిని ఎన్డీఆర్‌ఎఫ్‌ సహకారంతో సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. డీమార్ట్‌ వెనుక వరద నీటిలో చిక్కుకున్న నలుగురిని రక్షించామన్నారు. అత్యవసర సహాయం కోసం జీవీఎంసీ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800 4250 0009లో సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement