డాబాగార్డెన్స్: శ్రావణ మాసం మూడో శుక్రవారం సందర్భంగా నగరంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. బురుజుపేటలోని కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారిని స్వర్ణాలంకరణతో తీర్చిదిద్ది శ్రావణలక్ష్మి పూజలు నిర్వహించారు. దీంతో నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శ్రావణ మాసంలో పూజల్లో పాల్గొనదలచిన భక్తులు 0891–2711725, 2568645 నంబర్లలో పేర్లు నమోదు చేసుకోవాలని ఆలయ ఈవో సుజాత తెలిపారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా కనకమహాలక్ష్మి అమ్మవారి మూలవిరాట్‌కు ఉదయం 7 నుంచి 8 గంటల వరకు క్షీరాభిషేక సేవ నిర్వహించారు.
పుష్ప వస్త్రాలంకరణలో కన్యకాపరమేశ్వరి
కన్యకాపరమేశ్వరి ఆలయంలో వేకువజామున 5 గంటలకు అమ్మవారి మూలవిరాట్‌కు శుద్ధజలం, పాలు, పెరుగు, తేనె, గంధం, పసుపు, కుంకుమ, వివిధ పండ్ల రసాలతో కలిపి 108 ద్రవ్యాలతో క్షీరాభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి పుష్ప వస్త్రాలంకరణ చేసి, 108 బంగారు పుష్పాలతో ప్రత్యేక నివేదన సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు సామూహిక లలితా సహస్రనామ పారాయణం నిర్వహించారు. దేవస్థాన ఆస్థాన పురోహితుడు ఆర్‌బీబీ కుమార్‌శర్మ ఆధ్వర్యంలో సుమారు 250 మంది మహిళలు సామూహిక కుంకుమ పూజలో పాల్గొన్నారు.
ఇసుకకొండకు పోటెత్తిన భక్తులు
డాబాగార్డెన్స్: ఇసుకకొండపై వెలసిన రమా సహిత సత్యనారాయణస్వామి ఆలయం శ్రావణ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరాగా, వేకువజాము నుంచే క్యూలైన్లు బారులు తీరాయి. అనివెట్టి మండపం వద్ద భక్తులు దీపాలు వెలిగించి, సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. ఉచితంతో పాటు రూ.20, రూ.200 దర్శనాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈవో రాజగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. వన్‌టౌన్ పోలీసులు, ఆలయ సిబ్బంది భక్తులకు సేవలందించారు. సాయంత్రం మహిళలు ఆలయ ప్రాంగణంలో పారాయణం నిర్వహించారు.


