మద్దిలపాలెం: విశాఖ మ్యూజిక్, డ్యాన్స్ అకాడమీ (కళాభారతి)లో జరుగుతున్న సంగీత ఉత్సవాల ముగింపు సందర్భంగా ‘నేషనల్ ఎమినెన్స్ అవార్డ్’ వేడుకను వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి, ‘పద్మవిభూషణ్’ అవార్డు గ్రహీత డాక్టర్ పద్మా సుబ్రహ్మణ్యంకు.. ‘స్వర్ణకమలాన్ని’ వైభవ్ జ్యూయలర్స్ చైర్‌పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గ్రంథి మల్లికా మనోజ్ బహూకరించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఒడిశా గవర్నర్ డాక్టర్ కె. హరిబాబు చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ వేడుకలో ఏపీ మెడిటెక్ జోన్ లిమిటెడ్ ఎండీ, వ్యవస్థాపక సీఈఓ డాక్టర్ జితేంద్ర శర్మ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైభవ్ మేనేజింగ్ డైరెక్టర్ గ్రంథి మల్లికా మనోజ్ మాట్లాడుతూ... మనోజ్ వైభవ్ జెమ్స్.. జ్యూయలర్స్ లిమిటెడ్ (వైభవ్ జ్యూయలర్స్) కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా కళలను, సంగీతాన్ని ప్రోత్సహిస్తోందని తెలిపారు. గత 24 ఏళ్లగా విశాఖ కళాభారతిలో జరిగే నేషనల్ ఎమినెన్స్ అవార్డ్ ఫంక్షన్‌లో భారతదేశంలోని ప్రఖ్యాత సంగీత, నాట్య కళాకారులను ‘స్వర్ణకమలం’తో సత్కరించేందుకు వైభవ్ సంస్థ నిరంతరం సహకారం అందిస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాభారతి ట్రస్ట్ ప్రతినిధుల బృందం, కళాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


