రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు

Aug 29 2026 1:58 AM | Updated on Aug 29 2026 1:58 AM

తగరపువలస: స్థానిక వేంకటేశ్వరమెట్ట సమీపంలోని సర్వీస్‌ రోడ్డులో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. వీరిలో ఒక బాలిక పరిస్థితి విషమంగా ఉంది. బీచ్‌రోడ్డులోని మంగమారిపేటకు చెందిన మారుపల్లి భూలోక, అతని కుమారులు గౌతంసాయి, నందన్‌సాయి, మేనకోడలు గరికిన దేవి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. వీరు మంగమారిపేట నుంచి విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం బర్రిపేటకు వెళ్తుండగా, పద్మనాభం మండలం రేవిడి పంచాయతీ రౌతులపాలెంకు చెందిన మజ్జి శ్రీను నిర్లక్ష్యంగా వాహనం నడిపి వెనుక నుంచి ఢీకొట్టాడు. ప్రమాదంలో భూలోక, గౌతంసాయి, నందన్‌సాయిలకు స్వల్ప గాయాలు కాగా, దేవికి పలుచోట్ల ఎముకలు విరిగి తీవ్ర రక్తస్రావమైంది. ప్రమాదం అనంతరం ఆగకుండా వెళ్లిపోతున్న డ్రైవర్‌ను తాళ్లవలసకు చెందిన ఓ యువకుడు ద్విచక్రవాహనంపై వెంబడించి టి.నగరపాలెం వద్ద అడ్డుకుని భీమిలి ట్రాఫిక్‌ పోలీసులకు అప్పగించాడు. డ్రైవర్‌ మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన దేవిని మెరుగైన వైద్యం కోసం నగరంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు.

ఖర్చులు చెల్లిస్తేనే వైద్యం..

ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్స్‌ అందుబాటులోకి రాకపోవడంతో స్థానికులు క్షతగాత్రులను ప్రైవేటు వాహనంలో సంగివలస ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించారు. దేవికి ఎక్స్‌రే చేయాల్సి ఉందని, అందుకు డబ్బులు చెల్లించాలని ఆస్పత్రి సిబ్బంది చెప్పడంతో అక్కడికి చేరుకున్న భీమిలి ట్రాఫిక్‌ ఎస్‌ఐ బి.తిరుపతిరావు రూ.1300 చెల్లించిన అనంతరం వైద్యం ప్రారంభించారు. అత్యవసర సమయంలో డబ్బులు చెల్లించిన తర్వాతే చికిత్స చేయడం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement