నేడు సీఎం చేతుల మీదుగా
వర్చువల్ ప్రారంభం
విశాఖలో రెండు, రాష్ట్రంలో
మరో రెండు గురుకులాల అప్పగింత
మధురవాడ : గురుకులాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)ల పేరుతో ప్రైవేటు సంస్థలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. విశాఖపట్నం జిల్లాలోని మారికవలస ఏపీటీడబ్ల్యూఆర్ బాలుర ఇంగ్లీష్ మీడియం పాఠశాల, మేఘాద్రిగెడ్డ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులంతో పాటు రాష్ట్రంలోని గుంటూరు జిల్లా తాడికొండ, నెల్లూరు జిల్లా కోట గురుకులాలను సీవోఈలుగా మారుస్తున్నారు. మారికవలసలో ఏర్పాటు చేసిన సీవోఈని శనివారం సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, సీవోఈల ఏర్పాటు కోసం విద్యా సంవత్సరం మధ్యలోనే సజావుగా నడుస్తున్న గురుకులాలను ఖాళీ చేయించడం వివాదాస్పదమైంది. మారికవలస నుంచి 480 మంది విద్యార్థులను ఇతర ప్రాంతాలకు తరలించగా, తల్లిదండ్రుల అభ్యంతరాలు, విద్యార్థుల ఆందోళనలను పట్టించుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. కొందరు విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లినట్లు సమాచారం. మరోవైపు మారికవలసలో ఒకవైపు కొత్త విద్యార్థుల నమోదు జరుగుతుండగా, మరోవైపు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఐఐటీ, నీట్ శిక్షణ పేరుతో ప్రైవేటు సంస్థలపై ప్రభుత్వం ఆధారపడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో సీవోఈకి ఏడాదికి రూ.3.90 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. గురుకులాల్లో మౌలిక వసతులు, బోధనా సిబ్బందిని మెరుగుపరిస్తే ప్రైవేటు సంస్థల అవసరం ఉండదని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.


