ఎంవీపీకాలనీ: కుడి కిడ్నీలో 9 సెంటీమీటర్ల విల్మస్ ట్యూమర్‌తో బాధపడుతున్న 18 నెలల చిన్నారికి ఎంవీపీ కాలనీలోని మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వైద్యులు విజయవంతంగా లాపరోస్కోపిక్ సర్జరీ నిర్వహించారు. ఈ వివరాలను ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మురళీకృష్ణ వున్నా శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. పిల్లల మినిమల్లీ ఇన్వేసివ్ యూరో ఆంకాలజీ చికిత్సలో తెలుగు రాష్ట్రాల్లోనే ఈ తరహా శస్త్రచికిత్సను తొలిసారిగా నిర్వహించినట్లు తెలిపారు. చిన్నారికి స్నానం చేయిస్తున్న సమయంలో తల్లి పొట్ట కుడివైపున గడ్డను గుర్తించగా, పరీక్షల్లో కుడి కిడ్నీలో 9 సెం.మీ. పరిమాణంలో విల్మస్ ట్యూమర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందన్నారు. ఈ కేసును మల్టీడిసిప్లినరీ ట్యూమర్ బోర్డు సమీక్షించి, ముందుగా నియోఅడ్జువెంట్ కీమోథెరపీ అందించిన అనంతరం లాపరోస్కోపిక్ సర్జరీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. యూరో ఆంకాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ రాహుల్ తేజ్ పి, సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్, హీమటో ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ వున్నా నేతృత్వంలో చికిత్స అందించారు. డాక్టర్ గణేష్, అనస్థీషియా బృందం ప్రత్యేక పర్యవేక్షణలో శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందన్నారు. శస్త్రచికిత్స అనంతరం చిన్నారి ఆరు గంటల్లోనే కోలుకుని ఆహారం తీసుకోవడం ప్రారంభించిందని, ఎలాంటి డ్రైన్స్, ట్యూబ్స్ అవసరం లేకుండా రెండు రోజుల్లోనే డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. ఈ అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన వైద్య బృందాన్ని ఆస్పత్రి యాజమాన్యం అభినందించింది.


