కూటమి సర్కార్ ’ఉచిత’ హామీపై
నీలినీడలు
సిలిండర్ వచ్చినా చేరని రాయితీ సొమ్ము
నిబంధనల మెలికలతో మధ్యతరగతి
మహిళలకు తీవ్ర నిరాశ
జిల్లాలో 40 శాతానికి పైగా
నిలిచిన చెల్లింపులు
అధికారుల చుట్టూ ప్రదక్షిణలు
మహారాణిపేట: ఎన్నికల ముందు ఇచ్చిన ’ఉచిత గ్యాస్ సిలిండర్ల’ హామీ లబ్ధిదారులకు ఇప్పుడు చుక్కలు చూపిస్తోంది. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ’దీపం’ పథకం అమలులో రాయితీ సొమ్ము చెల్లింపులు నత్తనడకన సాగుతుండటంతో లబ్ధిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ తీసుకుని రోజులు గడుస్తున్నా సబ్సిడీ డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమకాకపోవడంతో లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు గడువు ముగుస్తున్నా ఇంకా 40 శాతానికి పైగా లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ కాకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతోంది. దీంతో విసిగిపోయిన జనం.. సివిల్ సప్లయిస్ జిల్లా అధికారి (డీఎస్‌ఓ), సహాయ సరఫరా అధికారి (ఏఎస్‌ఓ)లకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ తమ ఆవేదనను వెళ్లగక్కుతున్నారు. అధికారుల నుంచి కేవలం ‘ఈ రోజు వస్తుంది.. రేపు వస్తుంది‘ అనే పొడిపొడి సమాధానాలు తప్ప స్పష్టత కరువైంది.
ఎన్నికల ముందు ఒకలా.. ఇప్పుడు ఇంకోలా..
అధికారంలోకి వస్తే మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక నిబంధనల మెలికలు పెడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయంలో లేని ఆంక్షలను ఇప్పుడు తెరపైకి తేవడంతో సగం మంది దీపం వినియోగదారులకు కూడా లబ్ధి చేకూరడం లేదు. ఉచిత సిలిండర్ పొందాలంటే ’రైస్ కార్డు’ తప్పనిసరి అని నిబంధన పెట్టడంతో మధ్యతరగతి మహిళలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దీనికి తోడు ఈ–కేవైసీ, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా అనుసంధానంలో చిన్న తేడాలు వచ్చినా రాయితీ సొమ్ము నిలిచిపోతోంది. ‘ఎన్నికల ముందు ఒకలా చెప్పి, అధికారంలోకి వచ్చాక మరోలా వ్యవహరిస్తున్నారు‘ అంటూ మహిళలు కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నారు.
విడతల వారీగా అమలు
ఈ పథకం కింద మొదటి విడత జనవరిలో పూర్తి కాగా, రెండో విడత ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైంది. ఎల్‌పీజీ కనెక్షన్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఆధారంగా అర్హులను గుర్తించి పథకాన్ని అమలు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 3,71,481 మంది ఈ పథకానికి అర్హులుగా ఉన్నారు. అయితే వీరిలో ఎంతమందికి రాయితీ సొమ్ము పూర్తిగా జమ అయిందన్న అంశంపై స్పష్టత లేదు. మరోవైపు, తమ ఖాతాల్లో డబ్బులు పడలేదంటూ అనేక మంది లబ్ధిదారులు అధికారులను సంప్రదిస్తున్నారు. ప్రస్తుత ఐదో విడత గడువు ఈ నెల 30 వరకు ఉండగా, ఇంకా చాలామందికి సబ్సిడీ అందకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
పది రోజులు దాటినా పైసా రాలేదు..
ఈ విడతలో వంట గ్యాస్ సిలిండర్ వచ్చింది. జేబులోంచి డబ్బులు కట్టి సిలిండర్ తీసుకున్నాను. పది రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు పైసా కూడా ఖాతాలో పడలేదు. ఎవరిని అడిగినా వస్తాయి.. వస్తాయి అని కాలయాపన చేస్తున్నారు తప్ప కచ్చితంగా ఎప్పుడు వస్తాయో చెప్పడం లేదు. మధ్యతరగతి కుటుంబాలకు ఈ సొమ్ము ఎంతో అవసరం. ప్రభుత్వం స్పందించి మా డబ్బులు త్వరగా వచ్చేలా చూడాలి.
– అవ్వా దేవి,
చాకలివీధి, 27వ వార్డు, జీవీఎంసీ
ఖాతాల్లో త్వరలోనే జమ అవుతుంది!
అర్హులైన లబ్ధిదారులందరికీ డీబీటీ విధానం ద్వారా నేరుగా వారి ఖాతాల్లోనే రాయితీ సొమ్ము జమ అవుతుంది. పట్టణ ప్రాంతాల్లో 24 గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల్లోగా సిలిండర్ డెలివరీ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. రాయితీ సొమ్ము రాని వారు ఎవరైనా ఉంటే తమ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.
– వి.భాస్కర్,
సివిల్ సప్లయిస్ జిల్లా అధికారి


