గాజువాక : నగరంలోని జాతీయ రహదారులు నిత్యం రక్తమోడుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనల పట్ల అధికారుల ఉదాసీనత కారణంగా నగరం మృత్యుపాశంగా మారుతోంది. ముఖ్యంగా భారీ వాహనాల అతివేగం, నిబంధనలకు విరుద్ధంగా రద్దీ సమయాల్లోనూ నగరంలోకి ప్రవేశించడం ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతోంది.
నిషేధాజ్ఞలు బేఖాతరు : నిజానికి ఉదయం 8 గంటల లోపు, రాత్రి 10 గంటల తర్వాతే భారీ వాహనాలకు నగరంలోకి అనుమతి ఉంటుంది. కానీ ఈ నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయి. గాజువాక వంటి రద్దీ ప్రాంతాల్లో పరిశ్రమల సాకుతో లారీలు, టిప్పర్లు ఇష్టానుసారంగా దూసుకువస్తున్నాయి. ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించినా.. చర్యలు తీసుకున్నా ఎక్కడా పరిస్థితి మారడం లేదు.
ఆదివారం.. విషాదం
ఆదివారం బీహెచ్‌పీవీ జంక్షన్ వద్ద జరిగిన ఘోర ప్రమాదం నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సోమవారం పదో తరగతి పరీక్షలకు ప్రారంభం కానున్న నేపథ్యంలో కుమార్తెను సింహాచలం దర్శనం నిమిత్తం తీసుకువెళ్లిన తండ్రిని, వచ్చే నెలలో వివాహం జరుపుకోవాల్సిన ఓ యువకుడిని టిప్పర్ చిదిమేసింది. ఈ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే విశాఖ డెయిరీ వద్ద జరిగిన మరో ప్రమాదంలో యువతి మృత్యువాత పడింది. ఇలా రోజుకో ప్రాణం గాలిలో కలుస్తున్నా, సంబంధిత అధికారులు మాత్రం మొక్కుబడి తనిఖీలతో సరిపెడుతున్నారు. ఇప్పటికై నా యంత్రాంగం నిద్రలేవాలని, భారీ వాహనాలపై కఠిన ఆంక్షలు అమలు చేయాలని విశాఖ వాసులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ నెలలో రోడ్డు ప్రమాదాలు–మృతుల వివరాలు
1న : ఆనందపురంలో వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో వల్లపు రాజు మృతి
2న: ఆరిలోవ బీఆర్‌టీఎస్ రహదారిపై రోడ్డు ప్రమాదంలో ఆర్ సాయికిరణ్ మృతి
6న: ఆనందపురం హైవేపై బొలెరో వాహనం ఢీకొని రైతు ఈశ్వరమ్మ మృతి
10న : కూర్మన్నపాలెం సమీపంలో బలిరెడ్డి కిశోర్ మృతి
12న: ఎంవీపీ కాలనీ వద్ద రోడ్డు దాటుతుండగా మహిళను ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, పోలమ్మ మృతి
13న : సంగివలస వద్ద స్కూల్ బస్సు ఢీకొని సూర్యనారాయణ దుర్మరణం
15న : బీహెచ్‌పీవీ జంక్షన్ వద్ద టిప్పర్ బీభత్సం, ఇద్దరు మృతి


