సీపీ శంఖబ్రత బాగ్చి పిలుపు
మహారాణిపేట: వినియోగదారులు తమ హక్కులపై పూర్తి అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరమని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి పిలుపునిచ్చారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వినియోగదారుల హక్కులపై తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహించిన షార్ట్ ఫిలిం, షార్ట్ రీల్ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. వినియోగదారుల హక్కుల పరిరక్షణలో ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మార్కెట్‌లో నాణ్యమైన ఉత్పత్తులు, సేవలు అందేలా పర్యవేక్షణ పెరగాలన్నారు. జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలు జి.తనూజరెడ్డి మాట్లాడుతూ.. వినియోగదారుల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు కమిషన్ కట్టుబడి ఉందని తెలిపారు. సినీ నటుడు సుమన్ మాట్లాడుతూ.. సామాన్యుడికి హక్కులపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్య క్రమాలు, కళారూపాలు దోహదపడతాయన్నారు.
‘పవర్ ఆఫ్ ది సీఆర్‌సి’కి గుర్తింపు
సనారా వంశీ రచన, దర్శకత్వంలో రూపొందించిన ‘పవర్ ఆఫ్ ది సీఆర్‌సీ’ షార్ట్ రీల్‌కు ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో ద్వితీయ బహుమతి లభించింది. సామాన్యుడు అనారోగ్యం పాలై కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తే ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను, వాటిని చాకచక్యంగా ఎలా ఎదుర్కోవచ్చనే అంశాన్ని ఈ రీల్‌లో చక్కగా చూపించారు. ఈ రీల్‌లో నటించిన నటులు డాక్టర్ కుమార్ నాయక్, బొబ్బది అప్పారావు, అనిల్ గుమ్మల.. అతిథుల చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. జిల్లా పౌర సరఫరాల అధికారి వి.భాస్కరరావు, లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ రవికుమార్, ఫుడ్ సేఫ్టీ ఏఎఫ్‌సీ కల్యాణ్ చక్రవర్తి, సీఆర్‌సీ జాతీయ అధ్యక్షుడు వికాస్ పాండే, ప్రధాన కార్యదర్శి దొడ్డి చంద్రశేఖర్, సినీ రచయిత సత్యాడ నరసింగరావు, జాతీయ ప్రతినిధి అవినాష్ బెంజిమన్ తదితరులు పాల్గొన్నారు.


