సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం పాదయాత్ర
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంతో ముడిపడి ఉన్న పంచ గ్రామాల భూ సమస్యను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఓడిస్తామని సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం(పంచగ్రామాల భూముల కమిటీ) నాయకులు హెచ్చరించారు. ఈ సమస్య పరిష్కారం కోరి ఆదివారం సింహాచలంలోని తొలిపావంచా నుంచి ప్రహ్లాదపురం సమీపంలోని విరాట్‌నగర్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం కార్యదర్శి టి.వి.కృష్ణంరాజు మాట్లాడుతూ.. సమస్య మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆరు ప్రభుత్వాలు మారాయని, ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడమే తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో నగర ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. 1903 సర్వే సెటిల్‌మెంట్ గిల్మాన్ రికార్డుల ప్రకారం రైతులకు భూములపై హక్కులు ఉన్నాయని చెప్పారని, రికార్డులను పరిశీలించి సమస్యను పరిష్కరించాలని పేర్కొన్నారన్నారు. పంచగ్రామాల్లోని రైతులు, గృహ నిర్మాణదారులు, ఇంటి స్థలాల యజమానులు పాతికేళ్లుగా ఇదే విషయాన్ని మొరపెట్టుకుంటున్నారని తెలిపారు. 1903 రికార్డుల ప్రకారం రైతుల హక్కులను గుర్తించాలని, 1996–97లో దేవస్థానానికి ఇచ్చిన రైత్వారీ పట్టాలను రద్దు చేస్తూ శాసనసభలో చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పరిధిలోని 1,782 ఎకరాలను దేవస్థానం జాబితా నుంచి మినహాయించాలని, ఇళ్ల నిర్మాణాలకు, క్రయవిక్రయాలకు అనుమతులు ఇవ్వాలని కోరారు. ఎన్నికల లోపు పరిష్కారం చూపకపోతే కూటమి అభ్యర్థులకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు కె.ఆర్.కె. ప్రసాద్, నాయకులు సిహెచ్. సత్యనారాయణ, చిన్నబ్బాయి, ఎస్.సన్యాసిరావు, అఖిలేష్, అనురాధ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


