● మళ్లీ పాత రోజుల్లోకి..!
ఉషోదయ జంక్షన్‌లోని ఒక హోటల్ వద్ద గ్యాస్ దొరక్కపోవడంతో, ఖాళీ స్థలంలో టెంట్ వేసి వంటలు చేస్తున్న సిబ్బంది
నగరంలో వంట గ్యాస్ కష్టాలు సామాన్యుడిని భయపెడుతున్నా యి. ఒకవైపు గ్యాస్ కృత్రిమ కొరత వేధిస్తుంటే, మరోవైపు ఆన్‌లైన్ బుకింగ్‌లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు
వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆదివారం సెలవు దినం కావడంతో గృహిణులు, ఉద్యోగులు గ్యాస్ సిలిండర్ల కోసం పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ ఏజెన్సీల వద్ద సిలిండర్ల కోసం జనం ద్విచక్ర వాహనాలపై ఖాళీ సిలిండర్లతో గాలిస్తున్నారు. ఇక గ్యాస్ కొరత ప్రభావం సామాన్యులపైనే కాకుండా వ్యాపార రంగంపైనా తీవ్రంగా పడింది. హోటళ్లు, రెస్టారెంట్లకు గ్యాస్ సరఫరా పరిమితంగా ఉండటంతో యజమానులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. గ్యాస్ లేక వంటలు ఆగిపోయే పరిస్థితి రావడంతో, పలు హోటళ్లలో ఖాళీ ప్రదేశాల్లో టెంట్లు వేసి మరీ కట్టెల పొయ్యిల ద్వారా వంటలు చేస్తున్నారు. మరికొన్ని హోటళ్లలో కొన్ని వంటకాలను పరిమితం చేశారు. గ్యాస్ సరఫరా పునరుద్ధరణ అయ్యే వరకు వ్యాపారం దెబ్బతినకుండా ఉండేందుకు ఈ తరహా పాత పద్ధతులను ఆశ్రయించక తప్పడం లేదని హోటల్ యజమానులు చెబుతున్నారు.
– ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం


