
మెగా పేరిట దగా..
సాక్షి,విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రకటించిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసి నిరుద్యోగులను మోసం చేసిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆరోపించారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రకటించిన ‘దగా డీఎస్సీ’ నిరుద్యోగులను మోసం చేయడమేనన్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ 45,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి, ఇప్పుడు కేవలం 16,000 పోస్టులతో సరిపెట్టడం దారుణమని కేకే రాజు అన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 1998 డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 4,534 మందికి, 2008 డీఎస్సీ ద్వారా 2,193 మందికి, 2018 డీఎస్సీ ద్వారా 7,676 మందికి ఉద్యోగాలు కల్పించిందని ఆయన గుర్తు చేశారు. అలాగే 2022లో 502 టీచర్ పోస్టులను కూడా భర్తీ చేశామన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2024లో 6,100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించగా, ఎన్నికల ముందు దానిని కూటమి పార్టీలు కుట్రపూరితంగా కోర్టు కేసులతో ఆపేశారని కేకే రాజు ఆరోపించారు. ఇప్పుడు అదే నోటిఫికేషన్ రద్దు చేసి ‘మెగా డీఎస్సీ’ పేరుతో మోసం చేశారని, డిసెంబర్ లోపు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదని విమర్శించారు.అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతే తన కాలర్ పట్టుకొని అడగమని గతంలో లోకేష్ సవాల్ విసిరారని, ఇప్పుడు ఏడాది అయినా జాబ్ క్యాలెండర్ ఎక్కడ అని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు.