
ఎకై ్సజ్ సీఐపై రుబాబు?
తనిఖీలకు వెళ్లిన సమయంలో బార్ యజమాని అరుపులు, కేకలు తమ బార్లలో తనిఖీలు ఎందుకంటూ నిలదీత జోక్యం చేసుకున్న ఓ ఉన్నతాధికారి సర్దుబాటు చేసి చక్కబెట్టుకున్నట్టు విమర్శలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
నగరంలో ఓ బార్ యజమాని ఏకంగా ఎక్సైజ్ సీఐపై రుబాబుకు దిగినట్టు తెలుస్తోంది. తన బారులో తనిఖీలు ఎలా చేస్తారంటూ ఏకంగా అడ్డుకునే ప్రయత్నం చేసినట్టు సమాచారం. అంతేకాకుండా సదరు సీఐపై అరుపులు, కేకలతో విరుచుకుపడినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నగరంలో పలు ప్రాంతాల్లో అనధికారికంగా ఇతర దేశాల మద్యంతో పాటు డిఫెన్స్ మద్యం లభిస్తోంది. ఇటీవల ఎకై ్సజ్ అధికారుల తనిఖీల్లో కూడా మద్యం పట్టుబడింది. స్టీల్‌ప్లాంట్ సీజీఎం స్థాయి అధికారి ఇంట్లో పదుల సంఖ్యలో ఇతర రాష్ట్రాల మద్యం సీసాలు దొరికాయి. ఈ నేపథ్యంలో ఎక్సైజ్‌శాఖ అధికారులు నగరంలోని బార్లు, మద్యం షాపుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. నగరంలో ప్రధానమైన కూడలి వద్ద ఉన్న బారులో తనిఖీలకు వెళ్లిన ఎకై ్సజ్ సీఐపై సదరు బార్ యజమాని రుసరుసలాడటమే కాకుండా అరుపులు, కేకలతో నిలువరించే ప్రయత్నం చేసినట్టు సమాచారం. ఈ వ్యవహారంలో సదరు బారులో కొన్ని డిఫెన్స్ బాటిళ్లు కూడా అనధికారికంగా లభించినట్టు తెలుస్తోంది. దీనిపై ఎకై ్సజ్‌శాఖ ఉన్నతాధికారి ఒకరు రంగంలోకి దిగి సర్దుబాటు చేసినట్టు సమాచారం. ఈ వ్యవహారంలో భారీగానే నగదు చేతులు మారినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఎకై ్సజ్ సీఐతో ఆ బారు యజమాని వ్యవహరించిన తీరును.. సీసీ కెమెరాలను పరిశీలిస్తే బట్టబయలయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నా వద్దే తనిఖీలకు వస్తారా?
వాస్తవానికి సదరు బారు యజమాని.. గతంలో వేరే వ్యాపారంలో అక్రమంగా భారీగా సంపాదించి లిక్కరు వ్యాపారంలోకి అడుగుపెట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా కొద్ది మందితో జతకట్టి ఏకంగా 10 బార్లు, 10 వైన్ షాపులను దక్కించుకున్నారు. అంతేకాకుండా ప్రీమియం షాపును కూడా అధికార పార్టీకి బాగా దగ్గరి వారి మంటూ చెప్పుకుంటున్న వారితో కలిసి నెలకొల్పారు. వీరితో జతకలిసిన తర్వాత మరింతగా రెచ్చిపోతున్నట్టు తెలుస్తోంది. అధికారపార్టీకి బాగా దగ్గరని ఇంటి పేరుతో సహా చెప్పుకునే వారితో కలిసి వ్యాపార భాగస్వామ్యం ఉండటంతోనే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలోనే బార్లలో తనిఖీలకు వెళ్లిన ఎకై ్సజ్ సీఐపై నోరుపారేసుకున్నట్టు తెలుస్తోంది. తన బారులోనే తనిఖీలు చేస్తారా? అంటూ రెచ్చిపోయినట్టు సమాచారం. అయితే, ఆయనకు చెందిన రెండు బారుల్లో కూడా కొన్ని ఇతర మద్యం బాటిళ్లు దొరికినట్టు తెలుస్తోంది. అయితే, ఎకై ్సజ్‌శాఖ ఉన్నతాధికారి ఒకరు రంగంలోకి దిగి సర్దుబాటు చేయడంతో పాటు తను కూడా చక్కబెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాధవధారలోని తన కార్యాలయానికి పిలుపించుకుని మరీ సర్దుబాటు చేసినట్టు విమర్శలున్నాయి. ఈ వ్యవహారంలో రూ.15 లక్షల మేర చేతులు మారినట్టు ప్రచారం జరుగుతోంది.
మరో షాపు రాకుండా...!
వాస్తవానికి విశాఖ నగరంలో రెండు ప్రీమియం షాపుల ఏర్పాటుకు అవకాశం కల్పించారు. అయితే, తాము ఏర్పాటు చేసిన తర్వాత సాధ్యమైనంత ఆలస్యంగా రెండో ప్రీమియం షాపు తెరిచేలా అడ్డుకునే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. అసలు షాపు ఏర్పాటుకు అనువైన స్థలం దొరకకుండా అడ్డుకునే ప్రయత్నం చేసి సఫలమయ్యారు. కాకినాడకు చెందిన వ్యక్తికి వచ్చిన షాపు ఏర్పాటు కాకుండా గత మూడు నెలలుగా అడ్డుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. చివరకు తనకు దక్కిన ప్రీమియం షాపులో రాయలసీమకు చెందిన అధికారపార్టీ సామాజికవర్గానికే చెందిన వారికి భాగస్వామ్యం ఇవ్వడంతో చివరకు ఎలాగోలా నెలకొల్పేందుకు అవకాశం లభించినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ మరింత ఆలస్యం చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.