యాచకులు లేని నగరంగా విశాఖ | - | Sakshi
Sakshi News home page

యాచకులు లేని నగరంగా విశాఖ

Aug 15 2025 6:29 AM | Updated on Aug 15 2025 6:29 AM

యాచకు

యాచకులు లేని నగరంగా విశాఖ

● జ్యోతిర్గమయ కార్యక్రమానికి శ్రీకారం ● 243 మంది యాచకులను రెస్క్యూ చేసిన పోలీసులు

అల్లిపురం: యాచకులు లేని నగరంగా విశాఖను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పది నెలల కిందట నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి తలపెట్టిన ‘జ్యోతిర్గమయ’ కార్యక్రమానికి ఒక రూపు వచ్చింది. ఈ కార్యక్రమం ద్వారా నగరంలోని యాచకులకు తగిన ఆశ్రయం కల్పించి, వారిని గౌరవప్రదమైన జీవితం వైపు నడిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీపీ తెలిపారు. గురువారం పోలీస్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ మాట్లాడారు. ‘తమసోమా జ్యోతిర్గమయ’ అంటే చీకటి నుంచి వెలుగు వైపు ప్రయాణమని వివరించారు. రోడ్లపై భిక్షాటన చేసే నిరాశ్రయులను రోజూ చూసి బాధపడేవాడినని, ప్రతి మనిషి గౌరవంగా జీవించడానికి ప్రయత్నించాలన్నారు. కంట్రోల్‌ రూమ్‌ ఇన్‌స్పెక్టర్‌ హుస్సేన్‌, హార్బర్‌ సీఐ సింహాద్రి నాయుడు, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ తిరుపతిరావు, సీఐ చప్పా ప్రసాద్‌(వీఆర్‌), నగరంలోని అన్ని పోలీస్‌ స్టేషన్ల ఇన్‌స్పెక్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభించినట్లు చెప్పారు. గురువారం ఒక్క రోజే 243 మంది యాచకులను గుర్తించి, వారికి క్షవరం, స్నానం చేయించి, కొత్త దుస్తులు ఇచ్చి, టిఫిన్‌తో పాటు భోజనం కూడా అందించినట్లు తెలిపారు. 243 మందిలో 45 మంది బాగా ఉండటంతో వారి కుటుంబ సభ్యులను పిలిపించి, అప్పగించినట్లు వివరించారు. మానసిక స్థితి సరిగా లేని 9 మందిని ప్రభుత్వ మానసిక ఆరోగ్య ఆసుపత్రిలో చేర్పించామన్నారు. మిగిలిన 189 మందిని వివిధ పునరావాస కేంద్రాలకు పంపించినట్లు తెలిపారు. భవిష్యత్తులో వీరికి పనులు ఇప్పించడం, పని చేయలేని వారికి ఆశ్రయం కల్పిస్తామన్నారు. ట్రాన్స్‌జెండర్ల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నందున.. వారికి కూడా పని కల్పించడం లేదా ఆశ్రయం కల్పిస్తామన్నారు. జైలు నుంచి విడుదలైన వారికి కూడా జీవనాధారం కల్పించి గౌరవప్రదంగా బతకడానికి అవకాశం చూపిస్తామని సీపీ తెలిపారు. ఈ కార్యక్రమం మొదటి అడుగు మాత్రమేనని.. నగరంలోని దాతలు ముందుకు వచ్చినట్లయితే ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ సీపీ కృతజ్ఞతలు తెలిపారు.

యాచకులు లేని నగరంగా విశాఖ1
1/1

యాచకులు లేని నగరంగా విశాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement