
స్వాతంత్య్ర దినోత్సవానికి సర్వం సిద్ధం
విద్యుత్ కాంతులతో కలెక్టరేట్
బీచ్‌రోడ్డు: పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం నిర్వహించనున్న 79వ స్వాతంత్య్ర దినోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. వేడుకల్లో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల లక్ష్యాలు, ఫలితాలను వివరిస్తూ 8 విభాగాల ఆధ్వర్యంలో స్టాళ్లు, ఏడు విభాగాల ఆధ్వర్యంలో శకటాలను ప్రదర్శించనున్నారు. పరేడ్ మైదానంలో పైలట్ వాహనానికి ట్రయల్ రన్ నిర్వహించి సిద్ధం చేశారు. గౌరవ వందనం సమర్పించడానికి, పరేడ్ నిర్వహించడానికి వీలుగా వివిధ రక్షణ బృందాల నుంచి మొత్తం 52 మందికి శిక్షణ ఇచ్చారు. ఎనిమిది పాఠశాలల విద్యార్థులు దేశభక్తిని చాటుతూ నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించనున్నారు. వివిధ సంక్షేమ పథకాల కింద రూ. 214.99 కోట్ల నగదు ప్రోత్సాహకాలను మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతిభ చూపిన 375 మంది ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు ప్రదానం చేయనున్నారు.