
ఆధునిక హంగులతో యాత్రి నివాస్
వైఎస్సార్ సీపీ హయాంలో రూ.12.3 కోట్లతో పనులు ప్రారంభం 2024 నాటికే 85 శాతం పనుల పూర్తి కూటమి ప్రభుత్వంలో నత్తనడకన సాగిన పనులు స్టార్ హోటల్ సౌకర్యాలతో ఎట్టకేలకు అందుబాటులోకి.. ఏపీటీడీసీ సైట్‌లో మాత్రం పాత చిత్రమే
సాక్షి, విశాఖపట్నం: అందమైన విశాఖ జిల్లాకు మరిన్ని పర్యాటక హంగులు తీసుకొచ్చేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు ఇప్పుడు కొత్త ఫలాలను ఇస్తున్నాయి. దేశ విదేశీ పర్యాటకుల అభిరుచులకు అనుగుణంగా బీచ్‌రోడ్డులోని హరిత హోటల్ యాత్రి నివాస్ సుందరీకరణ పనులు పూర్తయి.. తాజాగా అందుబాటులోకి వచ్చాయి. ఈ హోటల్ స్టార్ హోటళ్లకు దీటుగా ఉన్నా.. కూటమి ప్రభుత్వం మాత్రం గత ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. ఏపీటీడీసీ వెబ్‌సైట్‌లో యాత్రి నివాస్ బుకింగ్స్ కోసం పాత ఫొటోనే కొనసాగిస్తోంది.
పర్యాటకుల స్వర్గధామంగా విశాఖ
విశాఖపట్నం ప్రకృతి సౌందర్యంతో పాటు అనేక పర్యాటక ఆకర్షణలను కలిగి ఉంది. ఇది దేశ, విదేశీ పర్యాటకులకు స్వర్గధామంగా మారింది. ఏటా విశాఖకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో పర్యాటకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో యాత్రి నివాస్ భవనాన్ని ఆధునికీకరించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం రూ.12.5 కోట్లతో యాత్రి నివాస్‌ను తీర్చిదిద్దే పనులకు శ్రీకారం చుట్టింది. అప్పుఘర్‌లోని బీచ్‌వ్యూలో ఉండే ఈ హరిత హోటల్‌లో మొత్తం 4 అంతస్తుల్లో 46 గదులు, రెస్టారెంట్ ఉన్నాయి. అయితే.. 25 ఏళ్ల కిందట నిర్మించిన భవనం కావడంతో గదుల్లో లీకేజీలు, కొన్ని చోట్ల పెచ్చులూడటం వంటి సమస్యలు తలెత్తాయి. భవిష్యత్తులో పర్యాటకుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉన్నందున.. ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ దీనిని సుందరీకరించింది.
2023 డిసెంబర్‌లో పనులు ప్రారంభం కాగా.. 2024 ఎన్నికల సమయానికి దాదాపు 85 శాతం పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో పనులు ఆగిపోయాయి. పలు పరిణామాల అనంతరం పనులు ప్రారంభమై.. రెండు నెలల కిందట పూర్తయ్యాయి. ఆధునికీకరించిన యాత్రి నివాస్‌లో 42 ఏసీ గదులు ఉన్నాయి. వీటిని ఏసీ సూట్, ఏసీ డీలక్స్, ఏసీ ఎగ్జిక్యూటివ్ రూమ్‌లుగా విభజించారు. ఇద్దరు పర్యాటకులకు డిమాండ్‌ను బట్టి ఏసీ సూట్ రూమ్ ధర రూ.3,750 నుంచి రూ.4,200 వరకు, ఏసీ డీలక్స్ రూమ్ రూ.4,625 నుంచి రూ.5,180 వరకు, ఏసీ ఎగ్జిక్యూటివ్ రూమ్ ధర రూ.3,125 నుంచి రూ.3,500 వరకు నిర్ణయించారు. వీటికి పన్నులు అదనంగా ఉంటాయి. గదులతో పాటు అత్యాధునిక వసతులతో రెస్టారెంట్, బార్, వెయిటింగ్ హాల్, కాన్ఫరెన్స్ హాల్ మొదలైనవి అందుబాటులోకి వచ్చాయి. హరిత హోటల్‌లో ఎక్కువగా పశ్చిమ బెంగాల్, ఒడిశాతో పాటు ఉత్తర భారత్ నుంచి వచ్చే పర్యాటకులు బస చేస్తుంటారు. టూరిజం ప్యాకేజీలో వచ్చే వీరికి ఈ హోటల్ ముఖ్యమైన గమ్యస్థానం. అందుకే, అత్యాధునిక సౌకర్యాలతో పాటు ఆయా రాష్ట్రాల ప్రజల అభిరుచులకు అనుగుణంగా కొత్త వంటకాలను అందించేలా రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు.