
కబ్జా కోరల్లో నగరంపాలెం చెరువు
ఇప్పటికే సగం ఆక్రమణ తాజాగా మరో అర ఎకరం మేర ఆక్రమణకు రెడీ రూ.5 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ఎసరు చోద్యం చూస్తున్న జీవీఎంసీ, రెవెన్యూ అధికారులు మధురవాడలో జలవనరుల విధ్వంసం
మధురవాడ: ఒకవైపు నీటి కొరతతో నగరం అల్లాడుతుంటే.. మరోవైపు సహజ సిద్ధమైన జలవనరులను కాపాడాల్సిన అధికారుల నిర్లక్ష్యం కబ్జాదారులకు వరంగా మారుతోంది. మధురవాడలోని నగరంపాలెం చెరువును కొందరు బరితెగించి కబళిస్తున్నారు. సుమారు రూ.5 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా పూడ్చివేస్తున్నా.. జీవీఎంసీ, రెవెన్యూ యంత్రాంగాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ.. చెరువు ఉనికినే ప్రశ్నా ర్థకం చేస్తున్నారు. వర్షాకాలం వచ్చినా భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నగరంలో నీటి యుద్ధాలు సర్వసాధారణమయ్యాయి. ఈ నేపథ్యంలో సహజ జలవనరులైన చెరువులను పరిరక్షించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కానీ విశాఖలో స్వతంత్రనగర్, కొమ్మాది వంటి ప్రాంతాల్లో చెరువులు కనుమరుగై కాలనీలుగా మారిపోయిన చరిత్ర కళ్లముందే ఉంది. ఇప్పుడు ఆ జాబితాలోకి నగరంపాలెం చెరువు కూడా చేరబోతోంది.
సగానికి పైగా ఆక్రమణ
విశాఖ రూరల్ మండలం, మధురవాడ రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 65/10లో 2.90 ఎకరాల విస్తీర్ణంలో నగరంపాలెం చెరువు ఉంది. రెవెన్యూ రికార్డుల్లో ట్యాంక్ పోరంబోకుగా నమోదైంది. అయితే ఇప్పటికే కబ్జాదారుల పుణ్యమా అని చెరువు సగానికి పైగా ఆక్రమణకు గురైంది. ప్రస్తుతం కేవలం 1.50 ఎకరాలు మాత్రమే మిగిలి ఉంది. తాజాగా.. మిగిలిన భూమిలో నుంచి మరో అర ఎకరం భూమిని ‘సామాజిక అవసరాల’ పేరుతో కొందరు పూడ్చివేయడం ప్రారంభించారు. నిర్మాణాల కోసం ఇప్పటికే సరిహద్దులను మార్కింగ్ చేసి సున్నం వేశారు.
ప్రైవేటు అవసరాలకు పెద్దపీట
చెరువు భూమిలో ఇప్పటికే కొందరు వ్యక్తులు అక్రమంగా నిర్మాణాలు చేపట్టగా, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. అంతేకాకుండా ఓ ప్రైవేటు లేఅవుట్‌కు దారి కూడా ఈ చెరువు భూమి నుంచే ఏర్పాటు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూమిని ప్రైవేటు ప్రయోజనాలకు అనుకూలంగా మార్చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఇక చెరువుకు జీవనాధారమైన నీటి ప్రవాహ మార్గాలను(గెడ్డలను) సైతం కబ్జాదారులు వదల్లేదు. వర్షపు నీరు చెరువులోకి చేరే మార్గాలను, చెరువు నిండిన తర్వాత నీరు బయటకు ప్రవహించే మార్గాలను పూర్తిగా ఆక్రమించుకున్నారు. దీనివల్ల చెరువు సహజ సిద్ధమైన ఉనికిని కోల్పోయి, కేవలం నిలిచిన నీటి గుంతగా మారే ప్రమాదం ఏర్పడింది.
ప్రకృతి ప్రేమికుల ఆవేదన
మధురవాడలో ప్రభుత్వ భూములకు కొదవలేదు. అయినప్పటికీ కొందరి కళ్లు ఈ చెరువుపైనే పడటం దురదృష్టకరం. ప్రభుత్వ రికార్డుల్లో స్పష్టంగా జలవనరుగా ఉన్న భూమిని కొందరు స్వాహా చేస్తుంటే సంబంధిత జీవీఎంసీ, రెవెన్యూ అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని ప్రకృతి, పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, చెరువును కబ్జాదారుల బారి నుంచి కాపాడి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

కబ్జా కోరల్లో నగరంపాలెం చెరువు