
చీటీల పేరుతో మోసం.. నలుగురి అరెస్ట్
గోపాలపట్నం: చీటీల పేరుతో సుమారు 50 మంది వద్ద డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడిన నలుగురిని గోపాలపట్నం పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను సీఐ ఎన్.వి.ప్రభాకర్ గురువారం వెల్లడించారు. గోపాలపట్నం ఇందిరానగర్‌కు చెందిన అంబళ్ల సత్యవతి, ఆమె కుటుంబ సభ్యులు బంగారు నాయుడు, తేజస్విని, నాగలక్ష్మి కలిసి చీటీల వ్యాపారం నిర్వహిస్తున్నారు. వీరు సుమారు 50 మంది వద్ద చీటీల పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. చీటీలు పూర్తయిన తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వకుండా, బాధితులను బెదిరించి, మరో రెండు చీటీలు వేస్తేనే డబ్బులు ఇస్తామని వేధించేవారు. దీంతో కొద్ది నెలల కిందట బాధితులు పోలీసులను ఆశ్రయించగా, నిందితులు డబ్బులు ఇచ్చేస్తామని చెప్పడంతో బాధితులు కొంతకాలం వేచి చూశారు. అయితే సమస్య పరిష్కారం కాకపోవడంతో బాధితులు ఇటీవల నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చిని ఆశ్రయించారు. కొందరు ఆరు లక్షల రూపాయల వరకు చీటీలు వేశారని ఆయనకు తెలిపారు. డబ్బులు అడిగితే దాటవేయడం, బెదిరించడంతో ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కాగా.. సీపీ ఆదేశాల మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటివరకు 22 మంది బాధితులు ఫిర్యాదు చేశారని, నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, బాధితుల వివరాలను పూర్తిస్థాయిలో వెల్లడిస్తామన్నారు.