
ఐవీఎఫ్ సెంటర్లలో తనిఖీలు
సీతంపేట: జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు తన బృందంతో కలిసి జిల్లాలోని అక్షయ ఐవీఎఫ్, నికిత హాస్పిటల్, రోషిణి ఫెర్టిలిటీ కేంద్రాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లో అన్ని పత్రాలను, రిజిస్ట్రేషన్ రికార్డులను పరిశీలించారు. ఇప్పటి వరకు ఎంతమందికి సంతానోత్పత్తి చికిత్స చేశారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. పేదవారికి రుసుము తగ్గించి సేవలందించాలని ఆయా కేంద్రాల నిర్వాహకులకు, గైనకాలజిస్టులకు సూచించారు. ఎప్పటికప్పుడు నిజాయితీగా సమాచారాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయానికి అందజేయాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ధరల పట్టిక ప్రదర్శించాలని సూచించారు. పీసీ అండ్ పీఎన్‌డీటీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఫారం ఎఫ్ లను తనిఖీచేసి ఐఈసీ బోర్డులను నిర్దేశించిన ప్రదేశంలో ఉంచాలని, సమయానికి రెన్యువల్ చేసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. ఆయన వెంట డాక్టర్ బి.ఉమావతి, డీపీఎంవో బి.నాగేశ్వరరావు ఉన్నారు.