
అంతస్తుకో రేటు
అనుమతులు గోరంత.. అక్రమాలు అందనంత
గాజువాక : నిబంధనలన్నీ పాటించి చిన్న భవనం నిర్మించుకుంటేనే భూతద్దంలో చూసి విరుచుకుపడిపోయే జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి షీలానగర్ దరి వెంకటేశ్వర కాలనీ 4ఎ లైన్‌లో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనంపై అవ్యాజప్రేమ చూపించారు. నిబంధనలకు పాతరేసినా, భవన నిర్మాణంలో పాటించాల్సిన నియమాలను ఉల్లంఘించినా, జీవీఎంసీ నుంచి పొందిన అనుమతులకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టినా చూసీ చూడనట్టు వదిలేశారు. అంతేకాదు అసంపూర్తిగా ఉన్న భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ను కూడా జారీ చేసేశారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో సామాజిక కార్యకర్తలు టౌన్‌ప్లానింగ్ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గాజువాక మండలం తుంగ్లాం సర్వే నంబర్ 102/2డి1ఎ 700 గజాల విస్తీర్ణంలో రెండు స్థలాలున్నాయి. అందులో ఒకటి 300 చదరపు గజాలు కాగా, మరొకటి 400 చదరపు గజాల స్థలం. ఈ రెండు స్థలాల్లో భవన నిర్మాణం కోసం సదరు బిల్డర్ రెండు వేర్వేరుగా అనుమతులు పొందాడు. 20 అడుగుల రహదారిని ఆనుకొని చేపట్టిన భవన నిర్మాణం ప్లాన్ ప్రకారమైతే ఒక స్థలంలో స్టిల్ట్+గ్రౌండ్+రెండు అంతస్తులు, మరో స్థలంలో స్టిల్ట్+గ్రౌండ్+మూడు అంతస్తులు నిర్మించుకోవాలి. సెట్‌బ్యాక్‌లను పూర్తిస్థాయిలో మినహాయించాల్సి ఉంది. అయితే, సెట్‌బ్యాక్‌లకు ఉంచాల్సిన స్థలంలో ఇంచి కూడా వదలకుండా నిర్మాణం జరిగిపోతోంది.
రుణాలకు బ్యాంకులు ససేమిరా!
ఈ భవనంలో ఫ్లాట్లు కొనుగోలు చేయాలనుకొనేవారికి రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు అంగీకరించలేదని తెలుస్తోంది. ఇది ప్రణాళిక నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాదని, ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారన్న కోణంలో బ్యాంకులు విముఖత చూపుతున్నట్టు తెలుస్తోంది. రెరా, జీవీఎంసీ బిల్డింగ్ బైలా, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం బిల్డర్‌తోపాటు సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
దాటవేత ధోరణిలో అధికారులు
ఈ విషయంపై గాజువాక జోన్ టౌన్‌ప్లానింగ్ ఏసీపీ వెంకటరావును సంప్రదించడానికి ‘సాక్షి’ ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. ఫోన్‌లో మాట్లాడటానికి ఇష్టపడలేదు. టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఆఫీసర్ వరప్రసాద్‌ను సంప్రదించగా ఆయన భిన్న విషయాలు చెప్పారు. సదరు భవన నిర్మాణం పూర్తయిందని ఒకసారి, నిబంధనల ప్రకారమే ఆక్యుపెన్సీ ఇచ్చామని మరోసారి, అక్కడ ఉల్లంఘనలు లేవని ఇంకోసారి చెప్పుకొచ్చారు. భవనం ఫొటోలు చూపించగా పరిశీలిస్తామని పేర్కొన్నారు.
ప్లాన్ ఒకలా, నిర్మాణం మరోలా..
ఉల్లంఘనలను పట్టించుకోని అధికారులు
భవనం పూర్తి కాకుండానే ఆక్యుపెన్సీ జారీ
టౌన్‌ప్లానింగ్ అధికారుల తీరుపై విస్మయం
నిబంధనలు తెలియవా?
బిల్డర్ ప్రాజెక్టు కోసం ఎటువంటి రెరా రిజిస్ట్రేషన్ లేకుండా 1020 చదరపు అడుగులు, 980 చదరపు అడుగులు, 1345 చదరపు అడుగులు, 1467 చదరపు అడుగుల చొప్పున ఫ్లాట్‌లను విక్రయానికి పెట్టాడు. ఇది రియల్ ఎస్టేట్ నియంత్రణ, అభివృద్ధి చట్టం (రెరా)ను ఉల్లంఘించడమేనని నిపుణులు పేర్కొంటున్నారు. అలా విక్రయించడం గృహ కొనుగోలుదారులను మోసం చేయడమేనని చెబుతున్నారు. భవన నిర్మాణం ఒకపక్క సాగుతోంది. మరోపక్క టౌన్‌ప్లానింగ్ అధికారులు ఆక్యుపెన్సీ జారీ చేసేశారు. నిర్మాణం పూర్తయిన తరువాత అన్నీ సరిగ్గా ఉన్నప్పటికీ అనేక రకాలుగా అధికారులను సంతృప్తి చేస్తే తప్ప రాని ఆక్యుపెన్సీ అన్నీ ఉల్లంఘనలు.. నిర్మాణం కూడా పూర్తి కాని భవనానికి ఎలా ఇచ్చారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలుతోంది.
నచ్చినట్లు నిర్మాణం
ఈ రెండు భవనాలకు బిల్డర్ వ్యక్తిగత అనుమతులు తీసుకున్నాడు. ప్లాన్ ప్రకారం వ్యక్తిగత నివాస భవనాలు కాకుండా వాటిని బహుళ యూనిట్లుగా మార్చాడు. తొమ్మిది మీటర్ల కంటే తక్కువ రహదారి ఉన్న స్థలాల్లో నిర్మించే భవనాలకు వ్యక్తిగత నివాస భవనంగా మాత్రమే ప్లాన్ పొందే అవకాశం ఉంది. దీంతో వ్యక్తిగత నివాస భవనాలకు ప్లాన్ పొందిన బిల్డర్ రెండు భవనాలను చట్ట విరుద్ధంగా ఒకే బ్లాక్‌లో విలీనం చేశాడు. ప్లాన్‌కు విరుద్ధంగా స్టిల్ట్+గ్రౌండ్+మూడు అంతస్తుల నిర్మాణం చేపట్టాడు. అదనపు అంతస్తును, సెట్ బ్యాక్‌ల ఉల్లంఘనలను సమర్థించుకోవడానికి ఎటువంటి టీడీఆర్‌లు పొందలేదు. ఇంతవరకు బిల్డర్ కక్కుర్తి పడి ఉండొచ్చు అనుకున్నా భవన నిర్మాణం ఇంకా పూర్తి కాకుండానే టౌన్‌ప్లానింగ్ అధికారులు దానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (15.07.2025న బీఏ నంబర్ 1086/1682/బి/జెడ్/వైటీఏ/2024) లు ఇచ్చేశారు. భవన నిర్మాణం పూర్తి కాకుండా, ఎలాంటి సౌకర్యాలు కల్పించకముందే ఉల్లంఘనల భవనాలకు టౌన్‌ప్లానింగ్ అధికారులు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఎలా ఇచ్చారన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

అంతస్తుకో రేటు