
మాదకద్రవ్య రహిత విశాఖే లక్ష్యం
కలెక్టర్ హరేందిర ప్రసాద్ పిలుపు
బీచ్‌రోడ్డు: విశాఖను మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చుదిద్దుదామని, ఈ మహా యజ్ఞంలో అందరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ పిలుపునిచ్చారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది చేత కలెక్టర్ నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏ దేశానికై నా యువతే ప్రధాన శక్తి అన్నారు. దేశాభివృద్ధిలో వారి పాత్ర ముఖ్యమైనదని, మాదక ద్రవ్య రహిత భారతదేశ ప్రచారంలో యువత పెద్ద సంఖ్యలో చేరాలి అనే సారాంశాన్ని చదివి వినిపించారు. అందరం మాదక ద్రవ్యాలకు దూరంగా ఉందామని ప్రతిజ్ఞ చేయించారు. డీఆర్వో బీహెచ్ భవానీ శంకర్, భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ కె.కవిత, ఈగల్ విభాగం సీఐ కల్యాణి, గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ ప్రతినిధి ఉమారాజ్, ఎన్‌సీబీ అధికారులు, సీడ్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
వైజాగ్ పోర్టులో ప్రతిజ్ఞ
సాక్షి, విశాఖపట్నం: మాదకద్రవ్య రహిత భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవం విశాఖపట్నం పోర్టు అథారిటీ(వీపీఏ)లో బుధవారం నిర్వహించారు. సాంబమూర్తి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో మాదకద్రవ్య రహిత సమాజం నిర్మాణానికి కట్టుబడి ఉంటామని పోర్టు అధిపతులు, అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా పోర్టు చైర్మన్ డా. ఎం అంగముత్తు మాట్లాడుతూ సీఈఎంఎస్, ఐఎంయూ విద్యా సంస్థల్లో మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించినట్లు చెప్పారు.