
ముందుకి.. వెనక్కి.!
కొమ్మాది/భీమునిపట్నం: విశాఖ తీరంలో సముద్రం వింతగా ప్రవర్తిస్తోంది. ఒకే తీర ప్రాంతంలోని రెండు సమీప ప్రదేశాల్లో భిన్నమైన పరిస్థితులు నెలకొనడం స్థానికులను, పర్యాటకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాగర్‌నగర్ వద్ద సముద్రం ఉవ్వెత్తున ఎగసిపడుతూ ముందుకు చొచ్చుకువస్తుండగా.. భీమిలిలో వందల అడుగులు వెనక్కి వెళ్లిపోవడం ఆసక్తికరంగా మారింది. సాగర్‌నగర్ తీరంలో గత మూడు రోజులుగా సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అలలు పెద్ద ఎత్తున ఎగసిపడుతూ ఇసుక తిన్నెల వైపు దూసుకొస్తున్నాయి. బుధవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగడంతో తీరానికి వచ్చిన పర్యాటకులు భయాందోళనలకు గురయ్యారు. దీనికి పూర్తి విరుద్ధంగా భీమునిపట్నం తీరంలో సముద్రం శాంతించి వెనక్కి తగ్గింది. సాధారణంగా ఆటుపోట్ల సమయంలో 20 నుంచి 30 అడుగులు వెనక్కి వెళ్లే సముద్రం, ఇప్పుడు ఏకంగా వంద అడుగులకు పైగా వెనక్కి వెళ్లింది. దీంతో భీమిలి తీరం విశాలంగా మారింది. సుమారు 30 ఏళ్ల కిందట ఉన్నంత విశాలమైన తీరం మళ్లీ కనిపించడంతో పర్యాటకులు, స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం వేళల్లో సందర్శకుల సంఖ్య పెరిగి తీరం సందడిగా మారుతోంది.

ముందుకి.. వెనక్కి.!