
‘సృష్టి’ అక్రమాల చిట్టా
మహారాణిపేట: పిల్లలు లేని దంపతుల ఆశలను సొమ్ము చేసుకుంటూ.. సరోగసీ, ఐవీఎఫ్ పేరుతో సృష్టి ఐవీఎఫ్ సెంటర్ పాల్పడిన అక్రమాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. ఈ దారుణమైన దోపిడీకి విశాఖపట్నం కేంద్రంగా నిలిచిందని పోలీసుల దర్యాప్తులో తేలింది.
రిజిస్ట్రేషన్ లేకున్నా.. : సృష్టి ఐవీఎఫ్ సెంటర్ విశాఖలోని తన కార్యకలాపాలను రిజిస్ట్రేషన్ లేకుండానే కొనసాగిస్తోంది. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో 2018 నుంచి 2023 వరకు మాత్రమే ఈ సెంటర్ నిర్వహణకు రిజిస్ట్రేషన్ ఉంది. ఆ తర్వాత ఎలాంటి అనుమతులు లేకుండానే జిల్లా పరిషత్ సమీపంలోని ఒక భవనంలో 5వ, 6వ అంతస్తుల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సెంటర్ నిర్వహణకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని కొందరికి లంచాలు ఇచ్చి నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డాక్టర్ నమ్రత ఆధ్వర్యంలో మేనేజర్ కల్యా ణి ఈ దందాలో కీలకపాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు.
ఢిల్లీ నుంచి గర్భిణిని రప్పించి.. : పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. గత నెలలో విశాఖ సెంటర్‌లో మగబిడ్డ జన్మించినట్లు గుర్తించారు. ఢిల్లీకి చెందిన ఒక గర్భిణిని విమానంలో విశాఖకు తీసుకొచ్చి ఇక్కడ డెలివరీ చేయించి, ఆ బిడ్డను సరోగసీ ద్వారా పుట్టిందని వేరొక దంపతులను నమ్మించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. డాక్టర్ నమ్రత గతంలోనూ ఇలాంటి కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడిందని, కొన్నేళ్ల కిందట రూ.30 లక్షలకు ఒక బిడ్డను కోల్‌కతాలోని దంపతులకు అమ్మకానికి పెట్టిందని పోలీసులు చెబుతున్నారు.
మంట గలిసిన కేజీహెచ్ ప్రతిష్ట
ఈ అక్రమాలతో కేజీహెచ్‌కు చెందిన వైద్యుల ప్రమేయం ఉన్నట్లు తేలింది. ఒక అనస్థీషియా, ఒక గైనిక్, పిల్లల వైద్యుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఒకే బ్యాచ్‌లో చదువుకున్నారని సమాచారం. ఇప్పటికే పోలీసులు నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కూడా తనిఖీలు నిర్వహించారు. ఈ అక్రమాల వెనక ఎంత మంది ఉన్నారనేది తెలుసుకోవడానికి పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తవ్వే కొద్దీ ఈ దందాలో కొత్త కోణాలు, కొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయని సమాచారం.
విశాఖ కేంద్రంగా అక్రమాలు