
ఎంపీ, ఎమ్మెల్యేలకు పట్టని పీ4!
● బంగారు కుటుంబాల దత్తతకు ముందుకు రాని వైనం ● మార్గదర్శకుల ఎంపిక తుది గడువు ఈ నెల 19 ● ప్రభుత్వ తీరుతో తలలు పట్టుకుంటున్న అధికారులు , ప్రజాప్రతినిధులు
మహారాణిపేట: రాష్ట్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలనలో భాగంగా అమలుకు ప్రతిపాదించిన పబ్లిక్(ప్రభుత్వ), ప్రైవేట్, పీపుల్(ప్రజల) పార్టనర్‌షిప్(పీ4) కార్యక్రమం నత్తనడకగా సాగుతోంది. మార్గదర్శకుల ఎంపికలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కనీస ఆసక్తి చూపట్లేదు. విశాఖ జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రధాన ప్రజాప్రతినిధులు చాలా వరకు స్థితిమంతులే. రూ.కోట్ల ఆస్తులకు పడగలెత్తిన వీరు బంగారు కుటుంబాల దత్తతకు ఎందుకనో చొరవ చూపట్లేదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సమావేశాలు నిర్వహించి మరీ పీ4 అమలుపై చర్చించారు. అయినా ఒక అడుగు ముందుకు పది అడుగులు వెనక్కి అన్నట్టుగానే కార్యక్రమ అమలు తీరు కనిపిస్తోంది.
సమీక్షలతోనే సరి..! : జిల్లాలో 73,452 బంగారు కుటుంబాలను గుర్తించారు. వీరిని దత్తత తీసుకుని ఆర్థికంగా చేయూతనివ్వాలన్న లక్ష్యంతో కూటమి సర్కార్ నడుస్తోంది. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందిరప్రసాద్ పీ4 అమలు కోసం సమీక్షల మీద సమీక్షలు నిర్వహించి మరీ అధికారులకు సూచనలిస్తున్నారు. దీంతో అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. ఈ నెల 19 నాటికి అవసరమైన మార్గదర్శకులను ఎంపిక చేయాలని అధికారులకు లక్ష్య నిర్దేశం చేశారు. దాతలను వెతికి పట్టుకోవడానికి జిల్లా యంత్రాంగం జిల్లా, మండల అధికారులకు సమావేశాలు నిర్వహించి పలు సూచనలు చేస్తోంది. అయితే ఇవేవీ అనుకున్నంత గొప్పగా సాగట్లేదన్నది నిర్వివాదాంశం.
ప్రజా ప్రతినిధుల్లో నిర్లిప్తత
పీ4 ద్వారా అట్టడుగున ఉన్న పేద కుటుంబాలను ఆదుకోవాలన్న సీఎం పిలుపుపై ప్రజాప్రతినిధుల్లో పెద్దగా ఆసక్తి కనిపించట్లేదు. జిల్లాలో స్థితిమంతులైన ఎమ్మెల్యేలు, ఎంపీలు నియోజకవర్గంలో బాగా వెనుకబడిన గ్రామాన్ని, లేదా కొన్ని కుటుంబాలనైనా దత్తత తీసుకోవచ్చు. కనీసం వీరు చెప్తే ముందుకొచ్చే వాళ్లు ఆయా నియోజకవర్గాల్లో పదులు, వందల సంఖ్యలో ఉంటారు. ఎందుకనో ఒకరిద్దరు మినహా ఎవరూ దీనిపై స్పందించట్లేదు. ఆర్థిక, సామాజిక స్థితిగతుల ఆధారంగా పరిశీలిస్తే ఇలాంటి సేవా కార్యక్రమాల్లో రాష్ట్రంలో విశాఖ జిల్లా ముందంజలో ఉండాలి. ఇక్కడి పాలకుల్లో స్పందన కరువవడంతో అధికారుల రెక్కల కష్టంపైనే పీ4 అమలు ఆధారపడి ఉంది.
సంస్థల అనాసక్తి : జిల్లా పరిధిలోని పారిశ్రామిక సంస్థలు, యాజమాన్యాలు ఇప్పటికే సీఎస్సార్ నిధులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అవి కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకే నిధులు కేటాయిస్తున్నాయి. సంపన్నులు కూడా తమ పరిధిలో చేతనైనంత సాయం చేస్తున్నారు. మళ్లీ కొత్తగా పీ4లో భాగస్వామ్యంతో పనేంటని వీరు పెదవి విరుస్తున్నారు. పేదల కోసం సంక్షేమ పథకాలు నూరు శాతం అమలు చేస్తే ఇలాంటి పథకాల అవసరమే ఉండదని చెప్తున్నారు. మరోవైపు పేదల్ని పెద్దల చెప్పుచేతల్లో పెట్టడమే ఈ పథకం ఉద్దేశమని పలువురు ఆక్షేపిస్తున్నారు.
వారం రోజులే గడువు
నాలుగంచెల ప్రక్రియ ద్వారా జిల్లాలో 73,452 బంగారు కుటుంబాలను గుర్తించారు. వీరిలో కూడా కొందరు అనర్హులున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ బంగారు కుటుంబాలను ఆదుకునే మార్గదర్శకుల ఎంపిక మాత్రం ఇంకా పూర్తి కాలేదు. సంపన్నులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, ప్రవాసాంధ్రుల్లో కనీసం 12 వేల మందిని గుర్తించాల్సి ఉంది. ఈ నెల 19 నాటికి వీరి ఎంపిక పూర్తి కావాలి. ఇప్పటి వరకు ఎంత మంది ముందుకొచ్చారో కూడా తెలియని పరిస్థితి.