
రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఏదీ?
● విచ్చల విడిగా మద్యం అమ్మకాలు ● వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి
మహారాణిపేట: రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని, ఓ పక్క మహిళలు భయాందోళనలో ఉంటే మరో పక్క మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నారని వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి ఆందోళన వ్యక్తం చేశారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎక్కడ చూసినా బెల్టు షాపులు దర్శనం ఇస్తున్నాయని, వీటి వల్ల మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. డబ్బులు తీసుకొని మద్యం షాపుల దగ్గర పర్మిట్ రూమ్‌లు పెడుతున్నారని, మద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వనరుగా మార్చుకుందని ఆక్షేపించారు. మహిళలు ఎక్కడికి వెళ్లాలన్నా బస్ ఫ్రీ అన్నారని, ప్రీమియం బస్సుల్లో మాత్రం మహిళలకు ఫ్రీ లేదని తెలిపారు. ఉచిత బస్సులు కేవలం 30 కిమీ దూరం మాత్రమే తిరుగుతాయని, తిరుపతి వెళ్లాలంటే మహిళలు ఎలా వెళ్లాలని, కండిషన్‌న్స్ అప్లై అనేలా ఫ్రీ బస్ పథకం కనపడుతోందని ఆక్షేపించారు. పథకాల కోసం వైఎస్సార్‌సీపీ నిలదీయడం వల్లే హామీలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. గరుడ, అమరావతి, ఇంద్ర, సూపర్ లక్జరీ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు చెప్పిందొకటి.. ఇప్పుడు మాట్లాడుతుంది ఇంకొకటి అని అన్నారు. మహిళలను ఇంతలా మోసం చేస్తారా..? అని ప్రశ్నించారు. సమావేశంలో కార్పొరేటర్లు శశికళ, పద్మారెడ్డి, పార్టీ మహిళా నేతలు శ్రీదేవివర్మ, కల్పన, జ్యోతి, పార్వతి, ధనలక్ష్మి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.