
రెండు బస్సుల ఢీ
ఐదుగురి విద్యార్థులకు గాయాలు
పెందుర్తి: విశాఖ–విజయనగరం జిల్లాల సరిహద్దులోని కొత్తవలస మండలం తాడివానిపాలెం వద్ద సోమవారం ఆర్టీసీ బస్సు, ఒక కళాశాల బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థినులకు స్వల్ప గాయాలయ్యాయి. తమ పరిధి కాకపోయినప్పటికీ, పెందుర్తి పోలీసులు తక్షణమే స్పందించి గాయపడినవారికి సహాయం అందించారు. కొత్తవలస నుంచి ప్రయాణికులతో ఐటీ హిల్స్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ఎల్.కోటలోని బెహరా కళాశాలకు చెందిన బస్సు తాడివానిపాలెం కూడలి వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కళాశాల బస్సులో ఉన్న ఐదుగురు విద్యార్థినులకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పెందుర్తి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పెందుర్తి సీఐ కేవీ సతీష్‌కుమార్ స్పందించి సి బ్బందిని ఘటనా స్థలానికి పంపించారు. గాయపడిన విద్యార్థినులను ఆటోలో గోపాలపట్నంలోని బెహరా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కొత్తవలస పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.