
దుఃఖంలోనూ ఆదర్శం.. తల్లి నేత్రాలు దానం
కంచరపాలెం: పుట్టెడు దుఃఖంలోనూ మానవత్వాన్ని చాటుకున్న ఘటన జీవీఎంసీ 47వ వార్డు, కంచరపాలెం, ఇందిరానగర్–5లో జరిగింది. తమ తల్లి మరణంతో తీవ్ర శోకంలో ఉన్నప్పటికీ ఆమె కళ్లను దానం చేసి ఆ కుటుంబం ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. గండిబోయిన ఈశ్వరమ్మ (75) ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో కేజీహెచ్‌లో మృతి చెందారు. తల్లి మరణంతో ఆ కుటుంబం దుఃఖంలో మునిగిపోయింది. అయితే ఈశ్వరమ్మ భర్త అప్పారావు, కుమారులు అప్పలరాజు, సూర్యచంద్రరావు, కుమార్తె లక్ష్మి ఆమె కళ్లను దానం చేయాలని నిర్ణయించుకున్నారు. వారి ఆదర్శ ఆలోచనతో మోషిని ఐ బ్యాంక్‌కు నేత్రదానం చేశారు. ఎల్వీ ప్రసాద్ ఇన్‌స్టిట్యూట్ టెక్నీషియన్ అజయ్ సహకారంతో కంటి రెటీనాను తొలగించి తరలించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఒక వ్యక్తి దానం చేసే కళ్లతో నలుగురికి కూడా చూపునివ్వవచ్చని కంటి వైద్య నిపుణులు వివరించారు.