
ఆరోగ్యం గుల్ల
నాణ్యత కల్ల
బయట ఫుడ్ తింటే అంతే..
బీచ్‌రోడ్డు : నేటి ఆధునిక ప్రపంచంలో యువత ఆహార అలవాట్లు శరవేగంగా మారుతున్నాయి. ఉరుకుల పరుగుల జీవితంలో, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయాల్సి రావడంతో ఇంట్లో వంటకు సమయం దొరకడం లేదు. దీంతో చాలామంది బయటి ఆహారంపై, ముఖ్యంగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలపై ఆధారపడుతున్నారు. అయితే, ఈ అలవాటు ఆరోగ్యానికి ఎంతవరకు సురక్షితం అన్న ప్రశ్న ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. తాజాగా నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో వెల్లడైన అంశాలు ఈ ఆందోళనలకు బలం చేకూర్చుతున్నాయి. పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్ షాపులతో సహా తనిఖీ చేసిన 85శాతం చోట్ల కల్తీ, నాసిరకమైన, అపరిశుభ్రమైన ఆహారాన్ని విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రోజుల తరబడి నిల్వ ఉంచిన పదార్థాలు, గడువు తీరిన ఆహార ఉత్పత్తులు, హానికరమైన రంగులు, రసాయనాలు ఉపయోగిస్తున్నట్లు బయటపడింది.
దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం
ఈ రకమైన ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, ఫుడ్ పాయిజనింగ్, దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆధునిక జీవనశైలి సౌకర్యాలను అందిస్తున్నప్పటికీ, ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం ఎంత ప్రమాదకరమో ఈ తనిఖీలు మరోసారి రుజువు చేశాయి. ప్రజలు తమ ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలని, బయటి ఆహారాన్ని తగ్గించి, ఇంట్లో తయారుచేసుకున్న పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
బేకరీల్లోనూ అదే పరిస్థితి
బేకరీలలోనూ ఇదే పరిస్థితి. చాలా దుకాణాల్లో గడువు ముగిసిన పదార్థాలు, హానికరమైన రసాయనాలు, రంగులు వాడుతున్నట్లు గుర్తించారు. కొన్నిచోట్ల రెండు, మూడేళ్ల క్రితం గడువు తీరిన వస్తువులను కూడా విక్రయిస్తున్నట్లు తేలింది. రామ్‌నగర్‌లోని బేకరీ డెన్, తగరపువలసలోని దేవీ స్వీట్స్, ఎస్‌ఎస్‌ఎన్ బేకరీలలో గడువు తీరిన ఆహారం విక్రయిస్తున్నారు. దయారం స్వీట్స్‌లో ఫంగస్ పట్టిన బాదంపప్పును అధికారులు గుర్తించారు.
175 కిలోల పాడైన ఆహారం స్వాధీనం
ఈ దాడుల్లో మొత్తం 175 కేజీల పాడైపోయిన ఆహారాన్ని స్వాధీనం చేసుకున్నారు. హోటళ్లు, బేకరీలలో గుర్తించిన 81 రకాల ఆహార పదార్థాల నమూనాలను పరీక్షల నిమిత్తం హైదరాబాద్ పంపారు. 17 హోటళ్లు, 16 స్వీట్, బేకరీ షాపులపై కేసులు నమోదు చేసి, 20 దుకాణాలకు నోటీసులు జారీ చేశారు. ప్రజలు బయట ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నగరంలోని అనేక హోటళ్లు,
రెస్టారెంట్స్‌లో పరిస్థితి దారుణం
ఒక్క రోజు తనిఖీల్లో 175 కేజీల
నిల్వ ఆహారం గుర్తింపు
85 శాతం హోటల్స్‌లో
కల్తీ ఆహారం విక్రయం
ఆహార భద్రత, ప్రమాణాల శాఖ దాడుల్లో
గుర్తింపు
హోటళ్లలో కల్తీ ఆహారం
20 బృందాలుగా ఏర్పడిన అధికారులు ఒక రోజు 40 హోటళ్లను తనిఖీ చేయగా, వాటిలో 85 శాతం చోట్ల నాసిరకం ఆహారం, అపరిశుభ్రత వెలుగులోకి వచ్చాయి. రోజుల తరబడి నిల్వ ఉంచిన చికెన్, మటన్, కుళ్లిపోయిన గుడ్లు, దుర్వాసన వస్తున్న నూడుల్స్ వంటి పదార్థాలను వంటలకు ఉపయోగిస్తున్నట్లు కనుగొన్నారు. కేవలం ఒక్క రోజులోనే 125 కేజీల పాడైపోయిన ఆహారాన్ని గుర్తించి పారవేశారు. ముఖ్యంగా ఇసుకతోటలోని మాయ, ముంతాజ్ హోటళ్లు, జగదాంబ జంక్షన్‌లోని ఆల్ఫా హోటళ్లలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు లభించాయి. చికెన్, మటన్ గ్రేవీలు నాలుగు నుంచి ఐదు రోజుల పాటు నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు.

ఆరోగ్యం గుల్ల