
‘తల్లి’కి వందనం ‘పాట్లు’
● కలెక్టరేట్‌కు క్యూ కట్టిన తల్లులు ● సచివాలయం, కలెక్టరేట్ చుట్టు ప్రదక్షిణలు
మహారాణిపేట: హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు అర్హుల సంఖ్యను తగ్గించేందుకు కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చిందంటూ తల్లుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ‘తల్లికి వందనం’ పథకం కోసం తల్లులు పడుతున్న అష్టకష్టాలకు కలెక్టరేట్ వేదికగా సోమవారం మరోసారి సాక్ష్యంగా నిలిచింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు క్యూ కట్టిన తల్లులు, తమకు పథకం డబ్బులు ఎందుకు రాలేదో తెలియక తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ తల్లికి వందనం ఇస్తాం అని ఎన్నికల ముందు చెప్పిన నాయకులు, ఇప్పుడు ‘ఇంట్లో ఒకరికి ఉచిత సీటు వస్తే ఇంకొకరికి కట్’ అంటూ సరికొత్త నిబంధనలను తీసుకొచ్చారని తల్లులు మండిపడుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉచిత సీట్లు పొందినవారికి కూడా ‘అమ్మఒడి’ ఇచ్చిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం అర్హుల సంఖ్య తగ్గించేందుకే ఇలాంటి నిబంధనలు తీసుకొచ్చిందని ఆరోపించారు. ఈ కొత్త నిబంధనల వల్ల ప్రభుత్వం నుంచి ఏ పథకం వచ్చినా ‘తల్లికి వందనం’ కట్ అవుతోందన్న విషయం చాలామంది తల్లులకు తెలియక గగ్గోలు పెడుతున్నారు. ఉదాహరణకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీటు లభించినా, విద్యుత్ బిల్లు 300 యూనిట్లు దాటినా ఈ పథకం వర్తించకుండా చేస్తున్నారు. ఇంతేకాకుండా ఉచిత సీటు రానివారికి కూడా ‘మీకు ఉచిత సీటు వచ్చింది’ అని ఆన్‌లైన్‌లో చూపించి పథకాన్ని నిలిపివేస్తున్నారని తల్లులు కలెక్టర్ ముందు తమ ఆవేదనను వెళ్లగక్కారు. తల్లుల నుంచి భారీగా ఫిర్యాదులు రావడంతో కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ఈ ఫిర్యాదులను డీఈవో ప్రేమ్‌కుమార్, సమగ్ర శిక్షా అధికారులకు అందజేశారు. ఈ ఫిర్యాదుల పరిష్కారం కోసం డీఈవో కార్యాలయ సిబ్బంది, అధికారులు కలెక్టరేట్‌లోనే ల్యాప్‌టాప్‌లు పెట్టుకొని నిమగ్నమయ్యారు. ఒకవైపు తాము అన్ని విధాలుగా అర్హులమని, అయినా డబ్బులు రాలేదని తల్లులు ఆవేదన చెందుతుంటే, మరోవైపు ప్రభుత్వం కొత్త నిబంధనల పేరుతో సంక్షేమ పథకాలను కుదిస్తోందన్న విమర్శలు తీవ్రమవుతున్నాయి. ‘తల్లికి వందనం’ పథకంపై కొత్త నిబంధనలతో కూటమి సర్కారు తల్లుల విశ్వాసాన్ని దెబ్బతీస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అధికారులే సమాధానం చెప్పాలి
నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరూ ప్రభుత్వ పాఠశాల్లో చదువుకుంటున్నారు. ‘తల్లికి వందనం’ రాలేదు. పదే పదే సచివాలయం చుట్టు తిరుగుతున్నా...కలెక్టర్ కార్యాలయానికి ఇప్పటికి మూడో సారి వచ్చా...నా సమస్య పరిష్కారం కాలేదు. ఎవర్ని అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదు. అర్హుత ఉండీ కూడా తల్లికి వందనం డబ్బులు ఎందుకు ఇవ్వలేదో అధికారులు సమాధానం చెప్పాలి.
– ఎన్.భాగ్యలక్ష్మి,
పాపయ్యరాజుపాలెం, పెందుర్తి మండలం

‘తల్లి’కి వందనం ‘పాట్లు’