రోడ్డుపై సొమ్మసిల్లి పడిపోయిన మూగజీవాలు
విశాఖలో ఘటన
● రోడ్డుపై సొమ్మసిల్లి పడిపోయిన మూగజీవాలు ● విశాఖలో ఘటన
ఆరిలోవ: అక్రమంగా పశువుల్ని తరలిస్తున్న లారీ ఆదివారం అర్ధరాత్రి దాటాక ఓల్డ్ డైరీ ఫారం వద్ద జాతీయ రహదారిపై బోల్తాపడింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, లారీలో ఉన్న ఆవులు, దూడలు గాయపడ్డాయి. ఆరిలోవ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ప్రాంతంలోని సంతలో కొనుగోలు చేసిన 18 ఆవులు, దూడలను ఓ వ్యక్తి లారీలో కిక్కిరిసినట్లు ఎక్కించి విశాఖ వన్‌టౌన్ ప్రాంతానికి ఆదివారం రాత్రి అక్రమంగా తరలిస్తున్నాడు. హైవేపై విమ్స్ వైపు నుంచి విశాలాక్షినగర్ స్టేట్ బ్యాంక్ వైపు రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని అర్ధరాత్రి ఆ లారీ ఢీకొట్టి బోల్తాపడింది. వ్యక్తి తలకు తీవ్రగాయాలై, రక్తస్రావంతో రోడ్డుపై ప్రాణాలతో కొట్టుమిట్టాడాడు. లారీలో ఆవులు, దూడలు చెల్లాచెదురుగా రోడ్డుపై పడి సొమ్మసిల్లిపోయాయి. కొన్నింటికి గాయాలయ్యాయి. ఆ సమయంలో అటుగా వెళుతున్న వాహనచోదకులు పోలీసులకు సమాచారమివ్వడంతో ఆరిలోవ పోలీసులు ఘటనాస్థలికి వచ్చి కొనఊపిరితో ఉన్న వ్యక్తిని కేజీహెచ్‌కు తరలించారు. ఆస్పత్రికి తీసుకువెళ్లేసరికే ఆ వ్యక్తి మృతి చెందినట్లు అక్కడి వైద్యులు చెప్పారు. లారీతోపాటు, పశువుల్ని, డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. మృతుడి వివరాలు తెలియకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతిగా ఓ కేసు, అక్రమంగా గోవుల తరలింపుపై మరో కేసు నమోదు చేసినట్లు ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు తెలిపారు.
గోవుల్ని అక్రమంగా తరలిస్తున్న లారీ ఢీకొని వ్యక్తి మృతి