
నిర్ణీత సమయంలో అర్జీలు పరిష్కరించాలి
డాబాగార్డెన్స్ : జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వినతులు వెల్లువెత్తాయి. నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి మొత్తం 113 వినతులు వచ్చాయని తెలిపారు. వీటిలో అత్యధికంగా పట్టణ ప్రణాళికా విభాగానికి 67 ఫిర్యాదులు అందగా, మిగిలినవి ఇతర విభాగాలకు వచ్చాయని వివరించారు. జీవీఎంసీ అడ్మినిస్ట్రేషన్ అండ్ అకౌంట్స్‌కు 4 ఫిర్యాదులు, రెవెన్యూ విభాగానికి 8, ప్రజా ఆరోగ్యానికి 7, ఇంజినీరింగ్ విభాగానికి 22, యూసీడీ విభాగానికి 5 ఫిర్యాదులు వచ్చాయి. అనంతరం కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిశీలించి, సంబంధిత అధికారులతో సంప్రదించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని సూచించారు. వచ్చిన అర్జీలపై అధికారులు అదే రోజు స్పందించి కార్యాచరణ చేపట్టాలని అధికారులను, జోనల్ కమిషనర్లను ఆదేశించారు. కార్యక్రమంలో ప్రధాన ఇంజినీర్ పల్లంరాజు, అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి, ప్రధాన వైద్యాధికారి నరేష్ కుమార్, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.