
సచివాలయ హెల్త్ సెక్రటరీల ధర్నా
మహారాణిపేట: తమకు పబ్లిక్ హాలిడేస్ వర్తింపజేయాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సచివాలయ హెల్త్ సెక్రటరీల అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఏపీ యునైటెడ్ గ్రామ, వార్డ్ హెల్త్ సెక్రటరీస్ అసోసియేషన్ పిలుపు మేరకు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీలు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు సమర్పించారు. ఈ ఆందోళనకు అసోసియేషన్ గౌరవ అధ్యక్షురాలు పి. మణి, జనరల్ సెక్రటరీ ఎస్. సుభాషిణి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమను తరచూ డీఎంహెచ్‌వో దుర్భాషలాడుతున్నారని, అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జూన్‌లో చేపట్టిన బదిలీలను యథాతథంగా కొనసాగించాలని, తక్షణమే గ్రేడ్ 2 ప్రమోషన్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా తమకు ఇతర డిపార్ట్‌మెంట్ పనులు అప్పగించవద్దని, పెండింగ్‌లో ఉన్న ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని కోరారు. తమ సర్వీస్ రికార్డులను భద్రపరచడానికి ఒక అధికారిని కేటాయించాలని, పనివేళలను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మార్చాలని వారు విజ్ఞప్తి చేశారు. తమను పూర్తిగా వైద్య, ఆరోగ్య శాఖలో విలీనం చేయాలని వారు కోరారు.