
కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌కు 313 వినతులు
మహారాణిపేట: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు ప్రజల నుంచి 313 వినతులు అందాయి. వీటిలో అత్యధికంగా రెవెన్యూ విభాగానికి 130, జీవీఎంసీకి 82, పోలీసు విభాగానికి 15, ఇతర విభాగాలకు 86 ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన వినతులను వెంటనే ఆన్‌లైన్‌లో పరిశీలించి, నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పదేపదే వచ్చే ఫిర్యాదులను లోతుగా విచారించాలని, అవసరమైతే క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యను పరిష్కరించాలని సూచించారు. కాల్ సెంటర్ ఫీడ్‌బ్యాక్‌ను మెరుగుపరచాలని, ఫిర్యాదుదారుడితో సంబంధిత అధికారి తప్పనిసరిగా మాట్లాడాలని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో జేసీ కె. మయూర్ అశోక్, డీఆర్వో భవానీ శంకర్, , ఏడీసీ వర్మ పాల్గొన్నారు.