
కొనసాగిన అప్పన్న ఆభరణాల తనిఖీ
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారికి చెందిన ఆభరణాల తనిఖీ ఆదివారం రెండో రోజు కూడా కొనసాగింది. దేవాదాయ శాఖ రాజమహేంద్రవరం రీజినల్ జాయింట్ కమిషనర్ ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ ఈ తనిఖీలను నిర్వహించింది. సింహగిరిపై ఉన్న ఆలయ మ్యూజియంలోని స్వామివారి బంగారు, వెండి ఆభరణాలను, ఇతర వస్తువులను కమిటీ సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించారు. రిజిస్టర్లలో ఉన్న వివరాలకు అనుగుణంగా వస్తువులు సరిగ్గా ఉన్నాయో లేదో ఈ బృందం నిర్ధారించింది. ఈ తనిఖీల్లో విజయనగరం డిప్యూటీ కమిషనర్ కె.ఎన్.వి.డి.వి. ప్రసాద్, దేవాదాయ శాఖ జ్యువెలరీ వెరిఫికేషన్ అధికారి పల్లంరాజు, అంతర్వేది దేవస్థానం ఈవో ఎం.కె.టి.ఎన్. ప్రసాద్, తూర్పుగోదావరి జిల్లా డిప్యూటీ ఈవో ఇ.వి.సుబ్బారావు, రాజమహేంద్రవరం రీజినల్ జాయింట్ కమిషనర్ కార్యాలయ సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. వారికి దేవస్థానం ఈవో వి.త్రినాథరావు, డిప్యూటీ ఈవో రాధ, ఏఈవో రమణమూర్తి అవసరమైన వివరాలను అందజేశారు.