నిత్య విద్యార్థి.. డిగ్రీల దాహార్తి | - | Sakshi
Sakshi News home page

నిత్య విద్యార్థి.. డిగ్రీల దాహార్తి

Aug 11 2025 7:29 AM | Updated on Aug 11 2025 7:29 AM

నిత్య

నిత్య విద్యార్థి.. డిగ్రీల దాహార్తి

● 73 ఏళ్ల వయసులోనూ మెడిసిన్‌లో పీజీ ● రిటైరయ్యాక నాలుగు పీజీ కోర్సుల పూర్తి ● చిత్రలేఖనంలోనూ అందెవేసిన చేయి ● ఆదర్శంగా నిలుస్తున్న డా.జువ్వల నాగేశ్వరరావు

గాజువాక: ఆయనొక వైద్యుడు. 30 ఏళ్లపాటు వైద్యాధికారిగా పని చేసి రిటైరయ్యారు. ఇంత సీనియారిటీ ఉన్న ఆయన ఎక్కడికెళ్లినా మంచి జీతంతో అవకాశం ఇస్తారు. సొంతంగా క్లినిక్‌ తెరిచినా.. బాగా సంపాదించుకోవచ్చు. కానీ ఆయన అలా చేయలేదు. 73 ఏళ్ల వయస్సులోనూ విద్యార్థిగా మారారు. రోజూ తరగతులకు వెళ్తున్నారు. రిటైరయ్యాక నాలుగు పీజీ కోర్సులు పూర్తి చేసిన ఆయన ప్రస్తుతం మెడిసిన్‌లో పీజీ చేస్తున్నారు. అగనంపూడి ప్రభుత్వాస్పత్రిలో డీఆర్‌పీ కోసం వచ్చిన ఆయన్ని ‘సాక్షి’పలకరించగా ఆసక్తికరమైన తన జీవితానుభవాలను, అభిరుచులను పంచుకున్నారు.

నిత్య విద్యార్థిగా..

డాక్టర్‌ జువ్వల నాగేశ్వరరావు జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం అధికారిగా 2010 జూన్‌లో రిటైరయ్యారు. అందరిలాగే పెన్షన్‌ తీసుకుని శేష జీవితాన్ని ప్రశాంతంగా గడిపేయాలని అనుకోలేదు. ఇంకా ఉన్నత చదువులు చదవాలని నిర్ణయించుకున్నారు. అప్పట్నుంచి నిత్య విద్యార్థిగా మారారు. నిర్ణయం తీసుకోవడమే అదనుగా ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఏ సైకాలజీ పూర్తి చేశారు. అనంతరం ఎంఏ ఫిలాసఫీ, తరువాత ఎంఏ పాలిటిక్స్‌, ఆ తర్వాత ఏయూలోనే హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మూడేళ్ల ఎంబీఏ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆంధ్రా మెడికల్‌ కళాశాలలో డాక్టరేట్‌ ఇన్‌ మెడిసిన్‌(ఎండీ) చదువుతున్నారు. ప్రస్తుతం అగనంపూడి ప్రభుత్వాస్పత్రిలో డిస్ట్రిక్ట్‌ రెసిడెన్సీ ప్రొగ్రామ్‌(డీఆర్‌పీ) చేస్తున్నారు.

మెడికల్‌ కళాశాలల్లో అధ్యాపకుడిగా..

రిటైరైన అనంతరం డాక్టర్‌ జువ్వల వివిధ ప్రైవేట్‌ మెడికల్‌ కళాశాలలకు అధ్యాపకుడిగా బాధ్యతలు నిర్వహించారు. తొలుత మహారాజా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (మిమ్స్‌)లోని కమ్యూనిటీ మెడిసిన్‌లో ఫ్యాకల్టీగా పని చేశారు. అనంతరం గాయత్రి వైద్య కళాశాలలో ఆర్‌ఎంవోగా, కమ్యూనిటీ మెడిసిన్‌లో ఫ్యాకల్టీగా బాధ్యతలు నిర్వహించారు. ఉద్యోగంతో పూర్తిస్థాయిలో సంతృప్తి చెందని ఆయన ఇంకా చదువుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం పీజీ ఫైనలియర్‌ కొనసాగిస్తున్నారు.

చిత్రలేఖనంలోనూ దిట్ట

అధికారిగా, వైద్యునిగా అందిస్తున్న సేవలతోపాటు డాక్టర్‌ జువ్వల ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీల్లోనూను ముందుంటారు. వివిధ రకాల బొమ్మలు వేసి, వాటిని ప్రముఖులకు బహూకరించడం చేస్తుంటారు. కేజీహెచ్‌, డాల్ఫిన్‌ నోస్‌, ఓరచూపులు, లవ్‌బర్డ్స్‌, పలువురు దేశ నాయకులు, సామాజికవేత్తల ఫొటోలు ఆయన కుంచె నుంచి జాలువారాయి. వీటితోపాటు మిత్రులు కలిసినప్పుడు పద్యాలు పాడటం, పాటలు ఆలపించడం ఆయనకున్న మరో విశిష్టత.

ఉద్యోగానికే రిటైర్మెంట్‌

రిటైర్మెంట్‌ అనేది ఉద్యోగానికే. వయస్సుకు కాదు. రిటైరైనప్పటికీ నేను నా క్లినిక్‌ ద్వారా డబ్బు సంపాదించుకోవచ్చు. కానీ చదుకోవాలనే కోరిక బలంగా ఉండటంతో క్లినిక్‌ను మూసివేశాను. తుది శ్వాస వరకు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఆ క్రమంలో చదువును కూడా కొనసాగిస్తూ ఉండాలన్నది నా ధ్యేయం.

– డాక్టర్‌ జువ్వల నాగేశ్వరరావు

వైద్యాధికారిగా 30 ఏళ్లు

డాక్టర్‌ జువ్వల 30 ఏళ్లపాటు ప్రభుత్వ వైద్యాధికారిగా వివిధ బాధ్యతలు నిర్వహించారు. ఆంధ్రా మెడికల్‌ కళాశాలలో 1971–78 ఎంబీబీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆయన ఆ తర్వాత కోల్‌కతాలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌లో డిప్లొమా ఇన్‌ పబ్లిక్‌ హెల్త్‌(డీపీహెచ్‌) పూర్తిచేసి విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌(వీఎంసీ)లో వైద్యాధికారిగా కెరీర్‌ ప్రారంభించారు. వీఎంసీ డిస్పెన్సరీ మెడికల్‌ ఆఫీసర్‌గా 1981లో ఉద్యోగంలో చేరిన ఆయన ప్రజారోగ్యంలో ఎనలేని సేవలందించారు. యూకే ఫండింగ్‌తో వీఎంసీలో మురికివాడల అభివృద్ధి ప్రాజెక్టుకు ట్రైనింగ్‌ అండ్‌ ఇవాల్యుయేషన్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. 1990లో యూకే, ఫ్రాన్స్‌లో పర్యటించారు. అక్కడ అధ్యయనం ద్వారా కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ప్రతి ఐదు వేల మందికి ఒక హెల్త్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసేలా కృషి చేశారు. ఫలితంగా కార్పొరేషన్‌ అధికారులు విశాఖలో 48 హెల్త్‌ సెంటర్లను ప్రారంభించి 36 మంది వైద్యాధికారులను నియమించారు. వీఎంసీ కాస్తా జీవీఎంసీగా మారాక ఆయన జోన్‌–2, 4, 5లలో సహాయ ప్రజారోగ్యాధికారిగా పనిచేశారు. చివరికి జీవీఎంసీ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌గా పని చేసి రిటైరయ్యారు.

నిత్య విద్యార్థి.. డిగ్రీల దాహార్తి1
1/2

నిత్య విద్యార్థి.. డిగ్రీల దాహార్తి

నిత్య విద్యార్థి.. డిగ్రీల దాహార్తి2
2/2

నిత్య విద్యార్థి.. డిగ్రీల దాహార్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement