
అన్నదాతకు కొర్రీలు
● జిల్లాలో 6,499 మంది రైతులకు ఎగనామం ● వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 25,072 మందికి రైతు భరోసా సాయం ● కూటమి ప్రభుత్వంలో కేవలం 18,573 మందికే సుఖీభవ నిధులు
మహారాణిపేట: పెట్టుబడి సహాయం కోసం ఎదురుచూస్తున్న రైతులపై కూటమి సర్కార్ కత్తికట్టింది. పలు నిబంధనలతో అన్నదాత సుఖీభవ పథకంలో అన్నదాతల సంఖ్యపై కోతలు విధించింది. కొర్రీల మీద కొర్రీలు వేస్తూ అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లింది. ఎన్నికల ముందు ఈ పథకం కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చాక తొలి ఏడాదిలోనే హామీని తుంగలోకి తొక్కేశారు. గత ఏడాది ఈ పథకాన్ని అమలు చేయకుండా ఎగ్గొట్టిన కూటమి సర్కార్ ఈ ఏడాది విడుదల చేసిన లబ్ధిదారుల జాబితాలో వేల సంఖ్యలో అర్హులైన రైతుల పేర్లు కనపించడం లేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో 25,072 మందికి రైతు భరోసా నిధులు జమ చేశారు. కూటమి సర్కార్ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 2025–26 ఆర్థిక సంవత్సరంలో 18,573 మంది రైతులను అర్హులుగా ఎంపిక చేసింది. అంటే 6,499 మంది రైతులను అన్నదాత సుఖీభవ పథకానికి దూరం చేసింది.
వెబ్‌ల్యాండ్ సాకుతో..
వెబ్‌ల్యాండ్‌లో పేర్లు ఉన్న రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవ ఇస్తామని ప్రకటించడంలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూన్నారు. గతంలో ఎప్పుడు ఎక్కడ లేని నిబంధనలను కూటమి సర్కార్ అమలు చేయడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కౌలు రైతు, కుటుంబంలో ఒక్క లబ్ధిదారుడు ఎంపిక, పది సెంట్లు లోపు భూమి ఉన్నవారు తొలగింపు, ఆధార్, ఈకేవైసీ, బ్యాంకు ఖాతాలకు అనుసంధానం కాలేదని పలువురు రైతులను తొలగించడం వంటి చర్యలు అధికారులు చేపట్టారు. అనంతరం ఓటీపీ చెప్పాల్సి ఉంటుంది. వీటిపై అవగాహన లేక వేలాది మంది రైతులు వేలి ముద్ర వేయలేదు. ఇటువంటి నిబంధనల వల్ల జిల్లాలో 6,499 మంది రైతులను జాబితా నుంచి తొలగించారు. సర్కార్, అధికారుల నిర్లక్ష్యం కారణంగా వేలాది మంది రైతులు అన్నదాత సుఖీభవకు దూరమయ్యారు.
అప్పులు పాలు అవుతున్న కర్షకులు
పెట్టుబడి సాయం సకాలంలో అందకపోవడంతో రైతులు అప్పులుపాలయ్యారు. ఈ సీజన్‌లో పంటలు వేయడానికి పెట్టుబడి సహాయం కోసం రైతులు ఎదురు చూశారు. పెట్టుబడి సాయం అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎక్కువ శాతం రైతులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి సాగు చేపట్టారు. గత ఏడాది నుంచి వ్యవసాయ భారంగా మారడంతో రైతులు సాగుకు దూరమవుతున్నారు. గత వైఎస్సార్ సీపీ సర్కార్ ఖరీఫ్ సీజన్‌లో సకాలంలో రైతు భరోసా అందించి రైతులను ఆదుకుంది.