
పలుమార్లు ఆగిన గుండె.. ఎక్మోతో నిలిచిన ప్రాణం
● విశాఖలో ఎక్మోతో సీపీఆర్ చేసిన కిమ్స్ ఐకాన్ వైద్య బృందం
మహారాణిపేట: గుండె ఉన్నట్టుండి ఆగిపోతే.. అమ్మో ఆ ఊహే భయానకం. కానీ, విశాఖలో ఒక వ్యక్తికి పలు మార్లు గుండె ఆగింది. సమయానికి సరైన ఆస్పత్రిలో ఉండడంతో వైద్యులు ఎక్మో సీపీఆర్ చేసి మరీ అతడి ప్రాణాలు కాపాడారు. నగరంలోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి చెందిన పలువురు వైద్యులు సంయుక్తంగా చేసిన కృషితో అతడి ప్రాణం నిలిచింది. రోగి కోలుకోవడంతో ఆదివారం మీడియాకు ముందుకు తీసుకొచ్చి, చికిత్స వివరాలు వెల్లడించారు.
నగరంలోని అగనంపూడి ప్రాంతానికి చెందిన లక్ష్మణకుమార్ పాండా(31) ఓ ఫార్మా కంపెనీ ఉద్యోగి. అక్కడ ఆయన ప్రమాదవశాత్తు ఐసోబ్యుటైల్ నైట్రేట్ అనే విషపూరిత వాయువును పీల్చేశారు. ఫలితంగా శరీరంలోని భాగాలకు ఆక్సిజన్ సరఫరా ఆగిపోయి.. శరీరమంతా నీలిరంగులోకి మారిపోయింది. వెంటనే అతడిని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికే కార్డియాక్ అరెస్ట్ అయింది. సీపీఆర్ చేస్తున్నా కూడా పదే పదే గుండె ఆగిపోసాగింది. దీంతో ఆస్పత్రికి చెందిన ఎక్మో నిపుణుడు డాక్టర్ ఎం.రవికృష్ణ ఆధ్వర్యంలో వైద్యులు సాయి మణికందన్, రవి కన్నా కలిసి అతడికి ఎక్మో సాయంతో సీపీఆర్ చేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ ఏపీలో ఇంతవరకూ ఎవరికీ చేయలేదు. అయితే రోగికి క్షణక్షణం దిగజారుతున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఇలా చేయాలని తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలనిచ్చింది. మూడు రోజుల పాటు ఎక్మో మీద ఉంచిన తర్వాత అతడు క్రమంగా కోలుకున్నాడు.
మళ్లీ లేచి తిరుగుతాననుకోలేదు : ‘‘ఆరోజు ఏం జరిగిందో తెలిసేలోపే స్పృహ తప్పింది. మావాళ్లు నన్ను వెంటనే కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి తీసుకొచ్చి, ఎమర్జెన్సీ వార్డులో చేర్చారు. తర్వాత నా గుండె పదే పదే ఆగిపోయిందట. నేను అసలు లేచి మళ్లీ మనుషుల మధ్య మామూలుగా తిరుగుతానని అనుకోలేదు. డాక్టర్లు నా ప్రాణాలు నిలబెట్టారని తెలిసింది. వారికి, సిబ్బందికి, యాజమాన్యానికి కృతజ్ఞతలు’’అని లక్ష్మణకుమార్ పాండా చెప్పారు.