
కంబోడియాలో చిక్కుకున్న ఆంధ్రుల్ని కాపాడండి
డాబాగార్డెన్స్: కంబోడియాలో చిక్కుకున్న ఆంధ్రా కార్మికులను కాపాడాలని సీఎం చంద్రబాబును విశాఖ అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. వీరిని మోసగించిన ఏజెంట్ బొంగు మురళీరెడ్డిని తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జగదాంబ జంక్షన్ సమీపంలోని సిటు కార్యాలయంలో జేఏసీ ప్రతినిధులు ఆదివారం మీడియాతో మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళికి చెందిన ఏజెంట్ మురళీరెడ్డి డేటా ప్రాసెసింగ్ జాబ్‌ల పేరిట మాయమాటలు చెప్పి ఏడుగురి నుంచి చెరో రూ.1.70 లక్షలు తీసుకుని కంబోడియా పంపించారని పేర్కొన్నారు. అక్కడ వారికి ఆ ఉద్యోగాలు ఇవ్వకపోగా, కంబోడియా ఏజెంట్లకు అప్పజెప్పి ఒక్కొక్కరితో మరో మూడు వేల డాలర్లు కట్టించుకున్నారని తెలిపారు. అక్కడి నుంచి వారిని చైనీస్ సైబర్ మోసగాళ్లకు అప్పజెప్పి, వారిచే చట్ట వ్యతిరేక పనులు చేయించడానికి బలవంతం పెట్టారన్నారు. అందుకు అంగీకరించకపోవడంతో చిత్రహింసలకు గురి చేస్తున్నారని తెలిపారు. వీరిలో విశాఖకు చెందిన వారు ఒకరు, శ్రీకాకుళానికి చెందిన నలుగురు, అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఇద్దరు కార్మికులు ఉన్నారని పేర్కొన్నారు. తక్షణమే సంబంధిత మంత్రులు, అధికారులు స్పందించి, వారిని కాపాడి, రాష్ట్రానికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో జేఏసీ ప్రతినిధులు సీఎఫ్‌టీయూఐ జాతీయ అధ్యక్షుడు ఎన్.కనకారావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీఎస్‌వీ అచ్యుతరావు, సిటు జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్‌కేఎస్‌వీ కుమార్, కుమార మంగళం, పి.మణి, కొండయ్య పాల్గొన్నారు.