
చవితి నవరాత్రులకు పోలీస్ ఆంక్షలు
అల్లిపురం: రాబోయే వినాయక చవితి నవరాత్రులకు పలు ఆంక్షలు, బందోబస్తు ఏర్పాటుకు నగర పోలీసులు సిద్ధమయ్యారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నవరాత్రుల కమిటీలు పెరిగే అవకాశం ఉందని భావించి, పోలీస్ శాఖ కార్యాచరణ వివరించేందుకు సీపీ శంఖబ్రత బాగ్చి ఉత్సవ నిర్వహణ కమిటీలతో గురువారం సమావేశమయ్యారు. సీపీతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొని చవితి నవరాత్రుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మండపాల ఏర్పాటు, నిమజ్జనం, పోలీస్, ఇతర శాఖల అనుమతులు తదితర అంశాలపై చర్చించారు. నగర పరిధిలో చవితి నవరాత్రులు నిర్వహిస్తున్న కమిటీలు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మండపాల్లో సీసీటీవీ ఫుటేజ్ 24/7 రికార్డ్ చేసి పర్యవేక్షించాలన్నారు. సోషల్ మీడియా పుకార్లను నమ్మి, ఫార్వర్డ్ చేయొద్దన్నారు. అలాంటి సమాచారం ఉంటే పోలీసులకు వాట్సప్ 7995095799, 100, 112 నంబర్లకు తెలియజేయవచ్చన్నారు. బలవంతంగా డొనేషన్ల వసూలు, లక్కీ డిప్స్, లాటరీలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. నవరాత్రులతోపాటు నిమజ్జనం సమయంలో పాటించాల్సిన నిబంధనలను వివరించారు.